హైదరాబాద్, జూలై 5 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు జమచేయాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి సర్కార్ స్పందించింది.
ఇకనుంచి ఉద్యోగులందరికీ మొదటి తారీఖున డీబీటీ పద్ధతిలో వారి ఖాతాల్లో జీతాలు జమచేయాలని నిర్ణయం తీసుకున్నది. కాగా జూన్ నెలకు సంబంధించిన వేతనాలు మాత్రం నేడు సోమవారం జమ చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.