Telangana Tirumala : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్‌లో ఉన్న తెలంగాణ తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో సంపూర్ణమయ్యాయి. చివరి రోజున స్వామివారికి శాంతిపాఠం, ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన, నిత్యహవనముతో పాటు యాగశాలలో పూర్ణాహుతి, బలిహరణం, స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదపండితులు స్వామి వారికి శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా తిరుమాఢ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంతో పాటు సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆరు రోజులుగా ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, స్పీకర్ కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.