Telangana Thalli Statue | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయానికి చేర్చింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత విగ్రహాన్ని తరలించినట్టు సచివాలయవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 9న విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. విగ్రహం ఎవరికీ కనిపించకుండా చుట్టూ కవర్లతో కప్పేశారు. విగ్రహ రూపురేఖలపై అభ్యంతరాలు వస్తాయనే భయంతోనే గోప్యత పాటిస్తున్నారని తెలంగాణవాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎవరినీ సంప్రదించకుండానే తుదిరూపు ఎలా ఇచ్చిందని కవులు, కళాకారులు మండిపడుతున్నారు.
గతంలో కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రేవంత్ సర్కారు వైఖరిని ఎండగడుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డలంటే ఇంత చిన్నచూపా? నగలు, కిరీటాలు ఉండొద్దా? అంటూ నిలదీస్తున్నారు. ‘తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తాం. సంస్కృతి, సంప్రదాయాలు కనిపించేలా, ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తాం. ఇందుకు రాష్ట్రంలోని అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని, ప్రజల అభీష్టం మేరకు మార్పులు చేస్తాం’ అంటూ ఫిబ్రవరి 4న మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రభుత్వం ప్రకటించింది. సంప్రదింపుల కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలోని క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది. కానీ సబ్ కమిటీ ఎవరిని సంప్రదించిదంని, విగ్రహాన్ని గుట్టుగా దాచాల్సిన అవసరమేంటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.