Deshapathi Srinivas | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణతల్లి నుంచి బతుకమ్మను ఎడబాపితే ఎవరూరుకుంటరు?అని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. భారత ఉపరాష్ట్రపతిచే పూజలందుకున్న తెలంగాణతల్లి అధికారికతల్లి కాదా? అని నిలదీశారు. తెలంగాణ సమాజం ఉద్యమతల్లిని కాదని ఉత్తర్వుల తల్లిని కొలవదని స్పష్టంచేశారు.
ఏ బహుజనతల్లికి కిరీటంలేదో చెప్పాలని సవాల్ చేశారు. జేఏసీ తల్లి ముఖ్యమో, ఎమ్మెల్సీ తల్లి ముఖ్యమో ఎమ్మెల్సీ కోదండరాం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మలిదశ ఉద్యమ ఆనవాళ్లను తుడిచివేయాలన్న కుత్సితబుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణతల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి జారీ చేసిన ఉత్తర్వులపై విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
1996లో మొదలై 2014లో రాష్ట్ర సాధన వరకు ఉండే చరిత్ర. దానిని రద్దు చేయాలన్నది రేవంత్‌రెడ్డి కుట్ర. మలిదశ తెలంగాణ అనే మహోజ్వల ఘట్టం అగ్నిలోంచి పుట్టింది తెలంగాణతల్లి. ఆ తల్లి ప్రజలను ఉద్యమకారులుగా మలచింది. అపార ఉద్యమ సాహిత్యాన్ని సృష్టించింది. ఆత్మగౌరవ భావనను ఆకాశమంత ఎత్తుకు చేర్చింది. ఆ తల్లి ఒక కేసీఆర్ వంటి నాయకుడిని సృష్టించింది. ధూం..ధాంను జరిపించింది. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, యాదిరెడ్డి వంటి బిడ్డలు బలిదానం అయితే వాళ్లను ఒళ్లోపెట్టుకొని గుండెలవిసేలా ఏడ్చింది. రోడ్డుమీద కూర్చొని వంటావార్పూ చేసింది. రైళ్లకు అడ్డంగా నిలుచున్నది. కోటానుకోట్ల పాటలతో హోరెత్తి బతుకమ్మ రాగమై తీగసాగిన తల్లి. అటువంటి తల్లిని రద్దు చేయడం అంటే మలిదశ తెలంగాణ చరిత్రను కాలరాయడమే. ఉద్యమ చైతన్యంలోంచి ఆ తల్లి పుడితే ఇప్పుడు అధికారమదంలోంచి, కుట్రలోంచి పుట్టింది.
పదేండ్లు అధికారంలోకి ఉన్నప్పుడు తెలంగాణతల్లిని విస్మరించారనీ, ఆ విస్మరణను సవరించేందుకే తెలంగాణతల్లిని ప్రతిష్ఠించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు కదా..?
తెలంగాణ తల్లి సాంకేతికపరమైన అంశం కాదు.. భావోద్వేగపరమైన అంశం. సాంకేతికతలను అడ్డుపెట్టి, సమరచిహ్నాలను, సంస్కృతిని విధ్వంసం చేస్తానంటే ఎట్లా? ఉద్యమంలో గెజిట్ ఉన్నదని తెలంగాణతల్లిని పెట్టుకున్నరా? పదేండ్ల పరిపాలన ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతి చేత ఆ తల్లి పాదాల మీద పుష్పాలు వేయించింది. అమరజ్యోతి వద్ద అమరవీరులను ఆశీర్వదిస్తూ సువర్ణమూర్తిగా నిటారుగా నిలుచున్నది. అవి కండ్లకు కనపడవా? మీక్కావలసింది కాగితాలేనా? కాగితాల మీద రాతలతో హస్తం మాతను నిలబెట్టాలనుకుంటే ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రతిష్ఠించుకున్న తల్లే కలకాలం నిలుస్తుంది.
తెలంగాణతల్లి కవితను పోలి ఉండటం వల్లే మార్చినం అని అంటున్నరు. దీనికేమంటరు?
అదొక దుర్మార్గమైన కుట్ర. తెలంగాణ ద్రోహులు చేస్తున్న వాదన. తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణతల్లి ప్రతీకను కేసీఆర్ రూపుదిద్దినప్పుడు ఆంధ్ర వలసవాద మీడియా చేసిన వాదన అది. తెలంగాణతల్లి విగ్రహంలో ఆమెకు సంబంధించిన ఏ చిన్న పోలిక కూడా లేదు. కేవలం మలిదశ ఉద్యమాన్ని మలినపరచడం కోసం చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే.
మలిదశ ఉద్యమంలో కీలకంగా
ఉన్నవాళ్లు.. ఇవ్వాళ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నరు. వారికిలేని అభ్యంతరం మీకెందుకు? జేఏసీ చైర్మన్‌గా ఉన్న కోదండరాం ఎమ్మెల్సీగా ఉన్నరు. అట్లాంటి వారిని మీరు అవమానించినట్టు కాదా?
ఉద్యమంలోంచి ఉద్భవించిన తల్లే కోదండరాంను జేఏసీ చైర్మన్‌గా చేసింది. కోదండరాం కీర్తిని పెంచింది. కోదండరాంకు ఏమైనా ఘనమైన చరిత్ర ఉందంటే బతుకమ్మను చేతిలో పట్టుకున్నతల్లి ఆపాదించిన చరిత్రే అది. కోదండరాంను జేఏసీ చైర్మన్ చేసిన తల్లిని వద్దని ఎమ్మెల్సీని చేసిన తల్లే ముద్దు అంటారా?
సీఎం రేవంత్‌రెడ్డి అంటే ద్వేషం ఎందుకు? ఆయనేమీ ఉద్యమకారుడిని అని చెప్పుకున్న దాఖలా లేదు కదా!
ఆయన పట్ల వ్యక్తిగత ద్వేషం ఏముంటది. అయినా తనకూ ఉద్యమ చరిత్ర ఉన్నదని చెప్పుకున్నరు. అసెంబ్లీలో పత్రాలను చింపేశాను అని, తనకూ ఉద్యమ చరిత్ర ఉన్నదని చెప్పుకునే ప్రయత్నం చాలా చేశారు. అయితే, ఆయన ఉద్యమంలో చంద్రబాబు కోవర్టు. ఉద్యమంలో ఉన్నట్టు నటిస్తూ చంద్రబాబు ఆజ్ఞలను పాటిస్తూ ఉద్యమానికి, స్వరాష్ర్టానికి వెన్నుపోటు పొడిచిండు.
అంటే.. తెలంగాణతల్లి విగ్రహం కూర్పులో చంద్రబాబు సలహా ఉన్నదని అనుమానిస్తున్నారా?
ఉన్నదో లేదో తెలియదు కానీ, రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌పై వ్యక్తిగత కక్ష ఉన్నది. ముఖ్యంగా బ్యాగులతో ఎమ్మెల్యేలను కొనే క్రమంలో కెమెరాలకు దొరికిపోయి జైలుశిక్ష అనుభవించి, రాజకీయాల్లో ఉన్న అపసవ్యతలను ఆసరా చేసుకొని ముఖ్యమంత్రి కాగలిగిండు. ‘నేను ముఖ్యమంత్రినై నువ్వు పెట్టిన తెలంగాణతల్లిని మారుస్తున్న చూడు’ అని వికటాట్టహాసం చేస్తున్నడు. అది దుర్యోధనుడి వికటాట్టహాసం.
ప్రజాస్వామిక విలువలపై అపారమైన గౌరవం ఉన్నదని చెప్పుకునే మీలాంటి వారు ఒక ప్రజాప్రభుత్వం పెట్టిన ఒక తల్లిని ‘మేం తిరస్కరిస్తాం’ అని చెప్ప డంలో అర్థం ఏమిటి?
ఉద్యమ చరిత్ర నుంచి తెలంగాణ తల్లిని ఎడబాపకండి అంటున్నం. తెలంగాణతల్లి నుంచి బతుకమ్మను ఎడబాపకు. ఉద్యమ అవసరంలోంచి ఉద్భవించిన తల్లిని రాజకీయ అవసరం కోసం ఎడబాపొద్దు అన్నదే మా డిమాండ్. పోరాటం నుంచి పుట్టినతల్లి వేరు.. పదవీ ఆరాటంలోంచి పుట్టిన తల్లి వేరు. మొదట ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణతల్లిని సగౌరవంగా కొలిచింది. అమరజ్యోతి వద్ద అధికారికంగా స్థాపించింది.
తాము ప్రతిష్ఠించిందే బహుజన తల్లి అని ప్రభుత్వం ఘంటాపథంగా చెప్తున్నది. దీనికేమంటారు?
ఉద్యమంలో బతుకుమ్మను ఒక పోరాట రూ పంగా ముందుకు తెచ్చినపుడు.. బహుజన బతుకమ్మ వేరే అన్నరు. ఇప్పుడు బహుజనలది బతుకమ్మే కాదని ప్రభుత్వం తన చర్యల ద్వారా చెప్పింది. అన్నీ మీరే అంటరా? మీ ఇష్టం ఉన్న ట్టు సంస్కృతిని నిర్వచిస్తరా? కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలు బతుకమ్మను ఆడనిమాట వాస్తవమే. అయితే, మలిదశ తెలంగాణ ఉద్యమం గొప్ప పరివర్తన తెచ్చింది. బతుకమ్మ తల్లి దళితవాడల్లోకిపోయి వాళ్లను తోలుకొచ్చుకున్నది. ఇవ్వాళ అందరూ ఆడుతున్నరు. వంగపల్లి నుం చి వాషింగ్టన్ దాకా బతుకమ్మ ఆడుతున్నరు.
ప్రతీ చెరువుగట్టు మీద బతుకమ్మ తల్లీబిడ్డలను ఎవరు ప్రతిష్ఠించిండ్లు.. ప్రభుత్వం కాదా? బ తుకమ్మ కేసీఆర్‌ది అని రేవంత్‌రెడ్డి కురుచ మనస్తత్వంతో అనుకుంటున్నరు. బతుకమ్మను అవమానించినవాడు బాగుపడే ప్రశ్నేలేదు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి మీద జనాగ్రహం పెల్లుబికుతున్నది. నాలుగేండ్లలో రద్దు అయిపోయే ప్రభు త్వం ఇది. ఈ మిడిసిపాటు ఎంతదాకా? మ నం సగర్వంగా స్మరించిన నినాదమే ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’. మన నినాదంలోనే రత్నమున్నది. తెలంగాణతల్లికి రత్నం ఉండొ ద్దా? కోహినూర్ వజ్రం పుట్టిన గడ్డ అస్తిత్వ ప్రతీ క వైభవంతో ఉండొద్దా? పేదరికం అధిగమించాల్సిన దశ మాత్రమే. ఆరాధనీయమైన దశకాదు.
బహుజనుల దేవతకు కిరీటం ఉండాల్సిన పనిలేదు అంటున్నరు. అందులో నిజం లేదంటారా?
వేములవాడ బద్దిపోచమ్మ, కొండపోచమ్మ, భద్రకాళి, రేణుకాఎల్లమ్మ, గంగమ్మ.. ఇలా బహుజనుల పురాణాల్లో కిరీటం లేని దేవత లే దు. సమ్మక్క-సారలక్కలు రాణులు, గోండ్వా నా సామ్రాజ్యం ఉన్నది. సంతాలులు మహాభారత కథను ఆరాధిస్తరు. మన రాష్ట్రపతి పేరు ద్రౌపది. ఎవరికి తోచిన రీతిలో వారు వక్రీకరణలు చేస్తే ఎట్లా?
తెలంగాణతల్లి రూపును తప్పుబట్టినా, వ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్టం ఊరుకోదని ప్రభుత్వం హెచ్చరించింది కదా?
ఉద్యమం నుంచే ఒక అప్రకటిత చట్టం ఉన్నది. చరిత్ర చేసిన చట్టమే గొప్పది. చరిత్రహీనులు చేసిన చట్టం కేవలం సాంకేతికం మాత్రమే. అయినా, ఉద్యమతల్లినికాదని ఉత్వర్వుల తల్లిని కొలవదు తెలంగాణ.
ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. దీనిని వివాదం చేయడం ఎందుకు?
తెలంగాణ సమాజం ఆమోదించి, ఆరాధించిన తల్లిని పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాలేదు కనుకే బాధ. మలిదశ చరిత్రను, ఉద్యమ ఆనవవాళ్లను రద్దు చేయాలనే నీచమైన కుట్రకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్పడుతున్నరు. ప్రభుత్వం పెట్టిన తెలంగాణతల్లి రూపంలో తెలంగాణ సింబల్ ఏదీ లేదు. జొన్న కేవలం తెలంగాణకు మాత్రమే పంటకాదు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో పండుతుంది. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ తరువాతే జొన్న విస్తీర్ణంలో తెలంగాణ స్థానం. తెలంగాణకు ప్రధాన ప్రతీక బతుకమ్మ. బతుకమ్మను ఎందుకు తీసేశారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలె.
ఒక్క బతుకమ్మ తల్లి చేతిలో లేకపోతే అసలు తల్లేకాకుండా పోతుందా?
బతుకమ్మకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. బతుకమ్మ తెలంగాణ తల్లివేరు. తెలంగాణకు తలమానికమైన పండుగ. తెలంగాణ వ్యవసాయం, చెరువులు, గాన సంస్కృతిని అల్లుకున్న పండుగ. శ్రామిక మహిళల సాహిత్యంతో కలగలసిన పండుగ. బతుకమ్మపాటలు బ్రాహ్మణులు రాయలేదు. ఆ పాటలు మరే అగ్రవర్ణాలు రాయలేదు. వాటి కర్తలు బహుజనులే. ఆ పాటల్లో ఉండే భాష బహుజనులదే. బతుకమ్మను అవమానించడం అంటే తెలంగాణ మూలాలను అవమానించడమే. అందుకు కాంగ్రెస్ నాయకులు తెగబడుతున్నరు. ఒక రాజు ఒక దేవాలయాన్ని కూల్చివేస్తే ఆ దైవాన్ని వదులకుంటమా? బతుకమ్మా అంతే.
తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్‌బండ్ మీద ఉన్న పరాయి విగ్రహాలనే తీయ లేదు.. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన తెలంగాణతల్లి విగ్ర హాన్ని తీసేస్తామని ప్రకటిస్తున్నరు. ఇది ద్వంద్వ వైఖరి కాదా?
ఉద్యమ సమయంలో నినదించినం. విగ్రహాలను తొలగించడంలో ఒక పెయిన్ ఉంటది. ఏదోఒక వర్గం హర్ట్ అవుతది. త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, సిద్దేంద్రయోగి దైవ సమానం. శ్రీశ్రీ, జాషువా ఆరాధనీయులు.ప్రతి విగ్రహం వెనుక ఒక సామాజికవర్గం మనోభావాలుంటాయి. ఆధిపత్యం కారణంగా ఆధిపత్య చరిత్ర రుద్దబడ్డది అని చెప్పడమే ముఖ్యం తప్ప, వలసవాద ఆధిపత్య చరిత్ర రుద్దిందీ అని చెప్పడమే కానీ, ఆ విగ్రహ వ్యక్తులు, కవుల మీద ద్వేషం కాదు. కనుక అటువంటి విద్వేషకర చర్యలకు కేసీఆర్ ప్రభుత్వం పూనుకోలేదని నేను అనుకుంట.
ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా పాతవి రద్దు చేయకుండా కొత్తది ఏదన్నా నెలకొల్పాలె. ఈ ప్రభుత్వ అభివృద్ధి నమూనా ప్రతీకను నెలకొల్పు ఎవరొద్దంటరు. నువ్వు తెచ్చిన మార్పును నెలకొల్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల పక్షాన ఒక ఆగ్రహ ప్రకటన చేశారు. ఒకవేళ తీసేయాలన్నదే ప్రజల డిమాండ్ అయితే.. తీసేయవలసి వస్తది. మలిదశ తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తే అంతకు రెట్టింతలు తెలంగాణ భావోద్వేగం పెల్లుబికి మహోగ్రహసాగరమై రేవంత్‌ను ముంచెత్తుతది.
రేవంత్ చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని అవమానిస్తే అదొక బీఆర్ఎస్కు సంబంధించిన అంశమా? అవి తెలంగాణ అస్తిత్వ సగర్వ ప్రతీకలు కాదా? ఉద్యమకాలంలో కాకతీయ తోరణం మన అస్తిత్వ చిహ్నమని చెప్పినవాళ్లు దాన్ని తీసేస్తానని అంటే బాధ కలగదా? మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు సినారె సూచన మేరకు జలగం వెంగళరావు కాకతీయ తోరణాలను జ్ఞాపికలుగా ఇచ్చిండు అందరికీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాకతీయ తోరణాన్ని ఒక జ్ఞాపికగా ఇస్తున్నరు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం ఆ సంప్రదాయాన్ని బంద్ పెట్టిండు. తెలంగాణ బతుకును, బతుకమ్మను రెండింటినీ విధ్వంసం చేస్తున్నడు. ఈ విధ్వంసపు ఎరుకను ప్రజల్లోకి వివిధ రూపాల్లో ప్రచారం సాగిస్తం.