హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ పదవుల ఎన్నిక విషయంలో గలాటా చోటుచేసుకున్నది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన పీఆర్టీయూ 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన ఈ ఘటనలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి శ్రీపాల్‌రెడ్డితోపాటు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రు సురేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి దామోదర్‌రెడ్డితోపాటు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి నామినేషన్లను దాఖలు చేశారు.
చర్చల అనంతరం మోహన్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, దామోదర్‌రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంపై అభిప్రాయ సేకరణ జరపగా 30కి పైగా జిల్లాల ప్రతినిధులు శ్రీపాల్‌రెడ్డికి మద్దతు పలికారు. అయినా సురేశ్ పోటీకే మొగ్గుచూపారు. దీంతో నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఈ ప్రక్రియలో అధ్యక్ష పదవికి పోటీచేసిన సురేశ్‌ను బలపరిచిన వ్యక్తి తాను ఆయన్ను బలపరచడాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించడంతో సురేశ్ నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో శ్రీపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఈ సమయంలో ఆయన వర్గీయులు సమావేశంలో గొడవకు దిగారు. ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. ఈ గలాటా మధ్యే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సురేశ్ వర్గం సమావేశం నుంచి బయటికెళ్లిపోయింది. ఆ తర్వాత మంగళవారం జరిగిన మావేశానికి హాజరైన సురేశ్.. సోమవారం జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు ప్రకటించడం కొసమెరుపు.
రెండేండ్లుగా ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను దసరా పండుగలోపు చెల్లించాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఆర్టీయూ కౌన్సిల్ సమావేశాల అనంతరం ఆయన మాట్లాడుతూ సరెండర్ లీవులు, జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, మెడికల్, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, రెగ్యులర్ వేతనాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లులను ఏకమొత్తంలో చెల్లించాలని, దసరా కానుకగా, ఐదు డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 50 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలుచేయాలని, నగదురహిత హెల్త్‌కార్డులను జనవరిలోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు బీ మోహన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ సంఘ బాధ్యులు పేరి వెంకట్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, గుర్రం చెన్నకేశవరెడ్డి, గుండు లక్ష్మణ్, మనోహర్‌రావు, గీత తదితరులు పాల్గొన్నారు.