Temparature : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నమైతే చాలు భానుడు భగ్గుమంటున్నాడు. దాంతో వాతావరణ కేంద్రం హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారిచేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీచేయబడిన జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా మరో ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. వడగాలులు వీచే జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీచేసింది.