UPSC Civil Services Results | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యున్నతస్థాయి ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్‌లో తెలంగాణ జయకేతనం ఎగురవేసింది. సివిల్స్ 2022 ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. దేశంలోనే మూడో ర్యాంకుతో నారాయణపేట ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి సత్తాచాటారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన అజ్మీరా సంకేత్‌కుమార్ 35వ ర్యాంకుతో అదరగొట్టారు. ఆరుగురు తెలంగాణ బిడ్డలు టాప్ 100లో నిలిచి తెలంగాణ ఖ్యాతిని చాటారు. సివిల్స్ టాపర్‌గా ఢిల్లీ వర్సిటీకి చెందిన ఇషితా కిశోర్ నిలిచారు. ఆమె హైదరాబాద్‌లోని బేగంపేటలో జన్మించడం విశేషం. గరిమా లోహియా, స్మృతిమిశ్రా వరుసగా 2, 4వ ర్యాంకులు సాధించారు. గరిమా, స్మృతి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేయగా, ఉమా హారతి ఐఐటీ హైదరాబాద్‌లో బీ టెక్ చదివారు. సివిల్స్ -2021లో కూడా మొదటి మూడు ర్యాంకులు మహిళలే సాధించారు.
యూపీఎస్సీ ప్రకటించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి, సివిల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వారు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
సివిల్స్ -2022లో మొత్తం 933 మంది అర్హత సాధించారు. వీరిలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు. మొదటి 25 ర్యాంకుల్లో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. మొదటి 25 ర్యాంకుల్లో అత్యధికులు ఐఐటీ, ఎన్ఐటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, జాదవ్పూర్వర్సిటీ, జివాజీవర్సిటీ తదితర అత్యున్నత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, మెడికల్ కోర్సులు చదివినవారే ఉన్నారు. వీరిలో చాలామంది సివిల్స్ పరీక్షలో ఆంత్రొపాలజీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, లా, చరిత్ర, గణితం, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, జువాలజీ సబ్జెక్టులనే ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకొన్నారు.
సివిల్స్ ర్యాంకులు సాధించినవారిలో 41 మంది దివ్యాంగులు ఉన్నారు. రిజర్వేషన్లవారీగా చూస్తే.. 345 మంది జనరల్, 99 మంది ఈడబ్ల్యూఎస్, 264 మంది ఓబీసీ, 154 మంది ఎస్సీ, 72 మంది ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారు. కాగా, 178 మంది అభ్యర్థులను యూపీఎస్సీ రిజర్వు లిస్టులో పెట్టింది. అవసరమైతే వీరిలో కొందరికి పోస్టింగులు ఇస్తారు. సివిల్స్-2022 నోటిఫికేషన్లో 1,022 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో 180 ఐఏఎస్, 38 ఐఎఫ్ఎస్, 200 ఐపీఎస్, 473 గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీస్, 131 గ్రూప్ బీ సర్వీస్ పోస్టులు ఉన్నాయి. ఫలితాల్లో మాత్రం 933 మందినే ఎంపికచేయటం గమనార్హం. 2022 జూన్ 5న నిర్వహించిన సివిల్స్-2022 ప్రిలిమినరీ పరీక్షకు 11,35,697 మంది దరఖాస్తు చేసుకోగా, 5,73,735 మందే హాజరయ్యారు. సివిల్స్ పరీక్షలో చివరి అంచె అయిన ఇంటర్వ్యూకు 2,529 మంది అర్హత సాధించారు.
సివిల్స్ -2022 తుది ఫలితాల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పండింది. దాదాపు 20 మందికి పైగా సివిల్స్‌కు ఎంపికై జయకేతనం ఎగురవేశారు. రాష్ర్టానికి చెందిన ఉమాహారతి జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో సత్తాచాటారు. అజ్మీరా సంకేత్ 35, శ్రీసాయి హర్షిత్ శాఖమూరి 40, రిచా కులకర్ణి 54, ఉత్కర్ష్‌కుమార్ 78, ఆవుల సాయికృష్ణ 94 ర్యాంకులు సాధించి టాప్ 100లో నిలిచారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి 40 మంది అభ్యర్థుల ర్యాంకులు సాధించగా, వారిలో 20కిపైగా తెలంగాణ అభ్యర్థులు ఉండటం విశేషం.
మా స్వస్థలం అచ్చంపేటవద్ద లింగాల. పాఠశాల విద్యను గద్వాల విశ్వభారతి స్కూల్లో, ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తిచేశా. మా నాన్న కిషన్‌లాల్ బ్యాంక్ ఉద్యోగి, అమ్మ చంద్రకళ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ చదివా. రిమ్స్‌కు వచ్చే రోగుల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులు చూసిన తర్వాత డాక్టర్‌గా అయితే వైద్యరంగంలోనే సేవచేయవచ్చు..అదే కలెక్టర్ అయితే అన్ని రంగాల్లో సేవ చేయవచ్చని భావించి సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. నాలుగో ప్రయత్నంలో ఈ ర్యాంక్‌ను సాధించా. నా ర్యాంక్‌ను బట్టి ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఏదో ఒకటి వస్తుందని ఆశిస్తున్నా. ప్రజలకు మెరుగైన సేవలందిస్తా.
– దీప్తిచౌహాన్, 630వ ర్యాంక్
సివిల్స్‌లో మంచి స్కోర్ సాధించేందుకు నాకు ఆంత్రొపాలజీ ఆప్షన్ కలిసొచ్చింది. క్రమంతప్పకుండా వీక్లీ టెస్టులకు హాజరై లోపాలు సవరించుకుంటూ ముందుకెళ్లా. కోచింగ్ తీసుకోవడం కలిసొచ్చింది. లెక్చరర్లు ఇచ్చిన సూచనలు, సలహాలు దోహపడ్డాయి. ఐఏఎస్ వస్తుందన్న నమ్మకం ఉన్నది. బాధ్యతాయుతంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తా.
మాది వైజాగ్. నాన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తారు. అమ్మ గృహిణి. శ్రీచైతన్య టెక్నో స్కూల్లో చదివా. ఆంధ్రా వర్సిటీలో బీటెక్ పూర్తి చేశా. సివిల్స్ సాధించాలనేది నా చిన్నప్పటి కల. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. 243వ ర్యాంకు వచ్చింది. హైదరాబాద్‌లో ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నా. ఆ తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ అయ్యా. మళ్లీ సివిల్స్ రాసి, మంచి ర్యాంకు సాధిస్తా.
-సాహితీ, 243వ ర్యాంకు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూర్పల్లి గ్రామానికి చెందిన శాఖమూరి అశ్రిత్ 22 ఏండ్లకే సివిల్స్ సాధించి ఔరా అనిపించారు. ఆలిండియా లెవల్లో 40వ ర్యాంకుతో సత్తా చాటారు. ఆశ్రిత్ నాన్న అమర్ క్రెడాయి(స్థిరాస్తి వ్యాపారుల సంఘం) కోశాధికారిగా పనిచేస్తున్నారు. అశ్రిత్ వరంగల్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు, ఇంటర్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, బీటెక్ రాజస్థాన్‌లోని బిట్స్(పిలానీ)లో చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని సీబీఎస్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకొన్నారు. ఉత్తమ ర్యాంకు సాధించిన శ్రీసాయి అశ్రిత్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు.
మాది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం. నాన్న రాములు విద్యుత్‌శాఖలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్. తల్లి యాదమ్మ వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్ సూపర్వైజర్. నిజాంసాగర్లోని జవహర్ నవోదయలో ఎస్సెస్సీ చదివా. నిజామాబాద్‌లో ఇంటర్మీడియట్, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశా. ఢిల్లీలోని జవహర్లాల్ వర్సిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో ఎంఏ పట్టా పొందా. ఢిల్లీ యూనివర్సిటీలో ‘సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్’లో పీహెచ్డీ చేశా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా. ప్రజలకు పాలనాపరంగా సేవలు అందిచేందుకు సివిల్ సర్వీసెస్‌ను ఎంపికచేసుకున్నా. కష్టపడి చదివి 200వ ర్యాంకు సాధించా. నా ర్యాంకుకు ఐఏఎస్ వస్తుందికానీ.. ఐఎఫ్ఎస్కు ఆప్షన్ ఇచ్చా.
-కంఠం మహేశ్‌కుమార్, 200వ ర్యాంకు
మాది కొత్తగూడెం. నాన్న శ్రీనివాస్ కొత్తగూడెంలోని ఓ లాడ్జి మేనేజర్. తల్లి నాగలక్ష్మి గృహిణి. మాది మధ్యతరగతి కుటుంబం. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివాసముంటున్నాం. కుటుంబ పరిస్థితిని చూసి ఎలాగైనా ఉన్నతస్థానంలో ఉండాలని నిర్ణయించుకొన్నా. సివిల్స్ సాధించడం నా జీవితాశయం. వరుసగా మూడుసార్లు ఫెయిల్ అయినప్పటికీ ఆశ వదులుకోలేదు. నిరాశ పడలేదు. రోజుకు పదిగంటలపాటు చదివా. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారంతో నిరంతరం శ్రమించా. నాలుగోసారి ఇంటర్వ్యూకు సెలక్ట్ అయి సక్సెస్ అయ్యా. సివిల్స్ కోసం నేను నెలకు రూ.50 వేల జీతం వచ్చే కొలువును వదులుకొన్నా. అందుకు తగిన ప్రతిఫలం దక్కింది. నా కల నెరవేరింది.
-గ్రందె సాయికృష్ణ, 293వ ర్యాంకు
పాఠశాలవిద్యను సెయింట్ ఆన్స్ స్కూల్ సికింద్రాబాద్‌లో, బీటెక్‌ను సీబీఐటీలో పూర్తిచేశా. మూడో ప్రయత్నంలో సివిల్స్ సాధించా. మా అమ్మ సైంటిస్ట్. నాన్న ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే సివిల్స్ సాధించి ఐఆర్ఎస్గా జాయిన్ అయ్యా. ఉద్యోగం చేస్తూనే మళ్లీ సన్నద్ధమయ్యా. నా ర్యాంకును బట్టి కచ్చితంగా ఐఏఎస్ వస్తుంది. తెలంగాణ బిడ్డగా నేను మొదటి ఆప్షన్ ఈ రాష్ర్టానికే ఇచ్చా. ఐఏఎస్‌గా ఎంపికయ్యాక తెలంగాణకే సేవలందించాలని ఉంది.
-రిచా కులకర్ణి, 54వ ర్యాంక్
మాది హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం.కోచింగ్‌కు వెళ్లకుండానే సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. మూడో ప్రయత్నంలో 460 ర్యాంకు వచ్చింది. మా నాన్న వ్యవసాయం చేస్తారు. రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. రోజుకు 8 గంటలు చదివా. ఐపీఎస్ వస్తుందని అనుకుంటున్నా. ఐఏఎస్ కావాలన్నది నా కల. ఇందుకోసం మరో సారి సివిల్స్ రాస్తా.
– పత్తిపాక సాయికిరణ్, 460వ ర్యాంక్
మాది హైదరాబాద్. అమ్మ మాధవి రిటైర్డ్ లెక్చరర్. నాన్న దీపక్ చిరు వ్యాపారి. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివా. శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తిచేశా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్, ఎంటెక్.. డ్యూయల్ డిగ్రీ పట్టా తీసుకున్నా. అప్పటి నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే ఉన్నా. ఇప్పటివరకు ఆరుసార్లు సివిల్స్ పరీక్ష రాశా. మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లా. చివరికి సివిల్స్‌లో 759వ ర్యాంకు సాధించా. మంచి ర్యాంకు కోసం మళ్లీ ప్రయత్నిస్తా. సివిల్స్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉన్నది.
– అక్షయ్, 759వ ర్యాంకు
పాఠశాల విద్య భారతీయ విద్యాభవన్ జూబ్లీహిల్స్ సూల్లో పూర్తిచేశా. సైఫాబాద్‌లోని ఫిట్జిలో ఇంటర్ చదివా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తిచేశా. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. మొదటిసారి డిఫెన్స్ సర్వీసు ఉద్యోగం వచ్చినా ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో చేరలేదు. నాలుగు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లివచ్చా. ఇప్పుడు ఆరో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా. నాన్న సునీల్‌కుమార్ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి. సోదరి మాలా శ్రీవాత్సవ్ యూపీలో ఐఏఎస్ అధికారిగా, రెండో సోదరి పారుల్ శ్రీవాత్సవ్ గుజరాత్లో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత సామాన్యుల సేవలో తరిస్తా. తెలంగాణ తరహా సంక్షేమ పథకాలను నేను పనిచేస్తున్న చోట అమలుచేసేందుకు ప్రయత్నిస్తా.
-ఉత్కర్ష్‌కుమార్, 78వ ర్యాంక్
నేను 5వ ప్రయత్నంలో మొదటిసారిగా సివిల్స్ సాధించా. నాన్న రైల్వేలో పనిచేస్తారు. అమ్మ గృహిణి. పాఠశాల విద్యను బోడుప్పల్లో, బీటెక్ ఐఐటీ ముంబైలో పూర్తిచేశా. సివిల్స్ కోసం రోజుకు 8 -10 గంటలు కష్టపడ్డా. కోచింగ్ తీసుకున్నా.. ఆ తర్వాత సొంతంగా చదువడం ప్రారంభించా. ఐఆర్ఎస్ లేదా మరో సర్వీస్ వస్తుందని ఆశిస్తున్నా. అయినా వచ్చే ఏడాది సివిల్స్‌కు సన్నద్ధమవుతా. ఐఏఎస్, ఐపీఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తా.
-సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, 426వ ర్యాంకు
సివిల్స్ టాపర్‌గా నిలిచిన ఇషితాకిషోర్ హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి కావడం విశేషం. ఈ సందర్భంగా ఇషితా కిషోర్ మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోని బేగంపేటలో పుట్టానని చెప్పారు. బీహార్‌కు చెందిన తాను ప్రస్తుతం యూపీలోని నోయిడాలో ఉంటున్నట్టు వెల్లడించారు. మూడో ప్రయత్నంలో తాను ఈ విజయం సాధించినట్టు తెలిపారు. తన తండ్రి హైదరాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పనిచేశారని, ఆయన నుంచి తాను స్ఫూర్తిపొందానని పేర్కొన్నారు. రెండుసార్లు ప్రిలిమ్స్ దశలోనే వెనుదిరిగిన తాను మూడో ప్రయత్నంలో పట్టుదలతో సివిల్స్‌ను సాధించానని చెప్పారు.
సివిల్స్ ర్యాంకుల్లో సీనియర్ ఐపీఎస్ మహేశ్ భాగవత్ స్టూడెంట్స్ హవా కొనసాగించారు. ఈసారి 150 మంది ర్యాంకులు సాధించారు.తన మార్గనిర్దేశనంలో సివిల్స్ సాధించినవారిలో టాపర్ ఇషితా కిశోర్ ఉండటం గొప్ప విషయమని మహేశ్ భగవత్ ‘నమస్తే తెలంగాణ’తో ఆనందాన్ని పంచుకొన్నారు. ఇషితా కిశోర్‌తోపాటు స్మృతి మిశ్రా (4), కృతికా గోయెల్ (14), జీవీఎస్ పవన్ దత్తా (22), సుంకె కష్మిరా కిశోర్ (25), అజ్మీరా సంకేత్‌కుమార్ (35), అనూప్ దాస్ (38), రిచా కులకర్ణి (54), ఉత్కర్ష్‌కుమార్ (78), ఆయుషీ జైన్ (74), వసంత్ దాబుల్కర్ (76) టాప్-100లో ఉన్నట్టు వెల్లడించారు.