Midday Meals | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం కోత పెట్టింది. 3 లక్షల మంది విద్యార్థులను తగ్గించింది. 2025-26 విద్యాసంవత్సరానికి 16లక్షల మంది విద్యార్థులకే ఆమోదం తెలిపింది. నిరుడు 18.88లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కేంద్రం ఆమోదం తెలుపగా, ఈ సారి 16లక్షల మంది విద్యార్థులకే పరిమితం చేసింది. మధ్యాహ్న భోజనం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులను ఖర్చుచేస్తున్నాయి. 2025-26 విద్యాసంవత్సరానికి మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశాన్ని ఇటీవలే నిర్వహించారు. ఈ సారి రాష్ట్రం నుంచి అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. అయితే యూడైస్ ఎన్రోల్మెంట్ ఆధారంగా లబ్ధిదారుల సంఖ్యను 16లక్షలకే కేంద్రం పరిమితం చేసింది.
ఈ పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చుచేయలేకపోతున్నది. ఫలితంగా 2024-25 విద్యాసంవత్సరంలో ఒక త్రైమాసికం నిధులు మురిగిపోయాయి. ఈ విద్యాసంవత్సరంలో 18లక్షల లబ్ధిదారులకు రూ. 341కోట్లు ఖర్చుచేసేందుకు పీఏబీ ఆమోదం తెలిపింది. దీంట్లో కేంద్రం వాటా రూ. 232కోట్లు కాగా రాష్ట్రవాటా రూ. 109 కోట్లు. అయితే ఇప్పటి వరకు కేంద్రం వాటాలో మూడు త్రైమాసికాల నిధులు రూ.189 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇటీవలే మూడో త్రైమాసికం కింద రూ. 43కోట్లు మార్చి, ఏప్రిల్ మాసాలకు కేటాయించారు. కేంద్రం ఏ త్రైమాసికం నిధులను ఆయా త్రైమాసికంలో ఠంచన్‌గా ఖాతాలో జమచేస్తున్నది. అయితే రాష్ట్రవాటా నిధులను విడుదల చేసిన తర్వాతే కేంద్రం వాటా నిధులను వాడుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రవాటాను సక్రమంగా విడుదల చేయకపోవడంతో కేంద్రం వాటా నిధులు సకాలంలో విడుదల కావడంలేదు. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నాలుగో త్రైమాసికం నిధులు నీళ్లల్లో కలిసిపోయినట్టయ్యింది.
కొత్తగా 2025-26 విద్యాసంవత్సరానికి రూ. 359 కోట్లకు విద్యాశాఖ ప్రతిపాదనలు సమర్పించింది. పిల్లల సంఖ్య 3లక్షలు తగ్గినప్పుడు నిధులెలా పెంచుతామని కేంద్రం అడిగినట్టు సమాచారం. విద్యార్థుల సంఖ్య తగ్గినా ఇటీవలే మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచిన నేపథ్యంలో రూ. 359 కోట్లకు ఆమోదం తెలపాలని రాష్ట్ర అధికారులు కేంద్రాన్ని కోరారు. అయితే పీఏబీ సమావేశం మినట్స్ బయటికి వస్తేనే కేంద్రం ఎంత మొత్తానికి అంగీకరించింది అన్నది తేలుతుంది.