హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ /డెంటల్ కోర్సుల ప్రవేశాలకు తెలంగాణ విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అడ్మిషన్లుకు ముందు వరసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివి ఉండాలనే నిబంధన విషయంలో పట్టుబట్టరాదని ఆదేశిస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అర్హత పరీక్షకు ముందు నాలుగేండ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధన ఆధారంగా దరఖాస్తును తిరసరించరాదని స్పష్టంచేసింది.
మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ /డెంటల్ కోర్సుల అడ్మిషన్ల నిమిత్తం కాళోజీ యూనివర్సిటీ ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ప లు వురు విద్యార్థులు వేసిన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ పీ శ్యాంకోశీలతో కూడిన ధర్మాసనం బు ధవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బీ మయూర్‌రెడ్డి, జే రామచంద్రరావు, న్యాయవాది అల్లూరి దివాకర్‌రెడ్డి వాదించారు. స్థానిక రిజర్వేషన్లపై మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు సవరణలు చేస్తూ 2024లో రాష్ట్రం జీవో 33 తెచ్చింది.
సవరించిన నిబంధనల ప్రకారం అడ్మిషన్‌కు ముందు నాలుగేండ్లు తెలంగాణలో చదివి తీరాలి. తెలంగాణలో పుట్టి పెరిగినవారు ఇతర కారణాలు, తల్లిదండ్రుల్లో ఎవరైనా బదిలీపై వేరే చోట్లకు వెళ్లినప్పుడు రెండేళ్లు బయట చదివి వస్తే స్థానికుడు కాకుండా పోతున్నాడు. దీనిపై నిరుడు ఇదే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్రం హామీ ఇవ్వడంతో హైకోర్టు తీర్పు అ మలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇప్పుడు ఆ నిబంధన పేరుతో స్థానిక కోటా కింద దరఖాస్తులను స్వీకరించడంలేదని వాదించారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ దరఖాస్తులను స్వీకరించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసి.. విచారణను 30కి వాయిదా వేసింది.