Telangana | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రాష్ట్ర రాబడి ఆశాజనకంగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, వేసిన పునాదులు రాష్ర్టాన్ని బలమైన ఆర్థికశక్తిగా నిలబెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) నివేదికలో వెల్లడించిన అంశాలు ఇదే విషయాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో రాష్ట్రం ఆర్థికంగా మరింత బలపడినట్టు స్పష్టమవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడి రూ.2,59,862 కోట్లు వస్తుందని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేయగా, తొలి ఎనిమిది నెలల్లోనే రూ.1,49,316 కోట్ల రాబడి రావడం విశేషం.
బడ్జెట్ అంచనాల్లో ఇది 58%. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,256 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా, నవంబర్ వరకు రూ.1,23,157 కోట్లు వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రూ.26,159 కోట్ల రాబడి అధికంగా రావడం కేసీఆర్ ప్రభుత్వ సమర్థ ఆర్థిక నిర్వహణకు నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి 19% వృద్ధిరేటు నమోదైంది. రాష్ట్ర రాబడుల్లో ఎప్పటిమాదిరిగానే జీఎస్టీనే అగ్రస్థానం పొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడి రూ.50,942 కోట్లు వస్తుందని ఆశించగా, మొదటి ఎనిమిది నెలల్లోనే రూ.30,047 కోట్లు వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 59%. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.9,355 కోట్లు, అమ్మకం పన్ను కింద రూ.19,591 కోట్ల ఆదాయం వచ్చింది.
కేంద్ర పన్నుల వాటా రూ.39,500 కోట్లు వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేయగా నవంబర్ వరకు రూ.8,177 కోట్లు మాత్రమే వచ్చింది. ఎప్పటిలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్లో ఈ సారి కూడా కేంద్రం వివక్ష కొనసాగించింది. కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో తెలంగాణకు రూ.41,259 కోట్లు వస్తుందని అంచనా వేయగా మొదటి ఎనిమిది నెలల్లో వచ్చింది రూ.4,533 కోట్లు మాత్రమే. అంచనాల్లో ఇది 11 శాతమే. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అన్నింటా వృద్ధిని సాధించిన తెలంగాణకు కేంద్రం గ్రాంట్ ఆశించిన మేరకు ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉండేది.