హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2025 వరకు మూడు వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)చైర్మన్ వై సతీశ్‌రెడ్డి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన రంగం, దాని అనుబంధ రంగాల ప్రతినిధులతో బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఓ రోడ్ మ్యాప్ రూపొందించడంలో భాగంగా ఈ సదస్సును ఏర్పాటుచేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లోనూ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ వసతి కల్పిస్తామని తెలిపారు. గత ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దాదాపు ఐదు రెట్లు పెరిగిందని చెప్పారు.
ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రెడో స్వయంగా ఇప్పటికే 150 చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని సతీశ్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే మరిన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో దేశంలోనే మొదటి చార్జింగ్ కేంద్రం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేశామని చెప్పారు. మౌలిక వసతులు పెంచేందుకు ఈ రంగానికి చెందిన ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రతిపాదించారు. సదస్సుల్లో రెడో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, జీఎం ప్రసాద్, వాహన తయారీ సంస్థలు, వాహన డీలర్లు, చార్జింగ్ స్టేషన్ నిర్వహణ సంస్థలు, ఫ్లీట్ సర్వీస్ ఆపరేటర్లు పాల్గొన్నారు.