హిమాయత్‌నగర్, ఫిబ్రవరి14: కేంద్రం తెచ్చిన హిట్, రన్ చట్టాన్ని రద్దు చేయాలని, ఆటో, మోటర్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ఆటోలు, క్యాబ్‌లు, డీసీఎం, లారీలను బంద్ చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మోటర్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్ జేఏసీ తెలిపింది. బుధవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో జేఏసీ నేతలు బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో గిరాకీలు లేక ఆటోడ్రైవర్లు మనోధైర్యం కోల్పో యి ఆత్మహత్యలు చేసుకొంటున్నారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. అక్రమంగా కొనసాగుతున్న ఓలా, ఊబర్, రాపిడో ద్విచక్రవాహనాలను నిషేధించి కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని కోరారు. ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండేందుకు వారికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ నేతలు వెంకటేశం, మారయ్య, శ్రీకాంత్, ప్రవీణ్, షేక్ సలావుద్దీన్, రాజేందర్‌రెడ్డి, సలీం, మీర్జారఫత్బేగ్ తదితరులు పాల్గొన్నారు.