హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా.. దాని ఫలితాలు అనేక కోణాల్లో ఉంటాయి. ఇందుకు కంటివెలుగు మరో ఉదాహరణ. కంటివెలుగులో ఉపయోగించే కండ్లద్దాలు తెలంగాణలోనే తయారవుతుండటం విశేషం. రాష్ట్రంలో బుధవారం నుంచి కంటివెలుగు రెండో విడత ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందికి కండ్లద్దాలు అవసరం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో సగం అంటే.. సుమారు 25 లక్షల అద్దాలు హైదరాబాద్ శివారు సుల్తాన్‌పూర్‌లోని ‘మెడికల్ డివైజెస్ పార్క్’లో తయారవుతున్నాయి. వైద్య రంగంలో వినియోగించే పరికరాలు, వస్తువుల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పటాన్చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో ‘మెడికల్ డివైజెస్ పార్క్’ను నెలకొల్పింది. ప్రభుత్వ ప్రోత్సాహం అందిపుచ్చుకొని ‘ఆకృతి’ అనే సంస్థ మూడేండ్ల కిందట ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించింది. దేశంలో కండ్లద్దాలు తయారు చేసే కంపెనీలు మూడు మాత్రమే ఉండగా.. దక్షిణ భారతదేశంలోని ఏకైక సంస్థ ఆకృతి కావడం విశేషం. ఇప్పుడు ఈ సంస్థ కంటివెలుగు కార్యక్రమ అమలులో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పార్క్ ఏర్పాటు చేసిన ఫలితం ఇప్పుడు తెలంగాణ బిడ్డలకు ఉపాధి రూపంలో, తెలంగాణ ప్రజలకు నాణ్యమైన కండ్లద్దాల రూపంలో అందుతున్నది. ప్రస్తుతం పార్క్‌లో 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో అత్యధిక శాతం మంది స్థానికులే. కంపెనీనే ఎంపిక చేసుకుని, శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నది.
కంటివెలుగు మొదటి దఫా సమయంలో ఆర్డర్ పొందిన కంపెనీ ముడిపదార్థం కోసం పూర్తిగా చైనాపై ఆధారపడింది. సరఫరాలో ఇబ్బందులు ఎదురుకావడంతో క్షేత్రస్థాయిలో కండ్లద్దాల అందజేతలో కాస్త గందరగోళం నెలకొన్నది. అయితే ఆకృతి సంస్థ ముడి సరుకును దక్షిణ కొరియా నుంచి తెప్పిస్తున్నది. దీంతో మరింత నాణ్యమైన అద్దాలు తయారవుతాయని సంస్థ ఎండీ కుల్దీప్ తెలిపారు. ముడి సరుకును మిక్స్ చేయడం, అద్దాలు తయారు చేయడం, పవర్ (పాయింట్) జోడించడం, ఫ్రేముల తయారీ, బాక్స్‌ల తయారీ ఇలా అన్నీ ఆటోమెటిక్‌గా మెషీన్ల ద్వారా తయారవుతాయని వెల్లడించారు. తమ కంపెనీ నుంచి ప్రతి 45-50 సెకండ్లకు ఒకటి చొప్పున గరిష్ఠంగా రోజుకు లక్ష అద్దాలను, 50వేల వరకు బాక్స్‌లను తయారు చేయవచ్చని చెప్పారు.
కంటివెలుగు రెండో దఫా కోసం 50 లక్షల కండ్లద్దాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించగా హైదరాబాద్‌లోని ఆకృతి సంస్థతోపాటు, ముంబైలోని ైస్టెల్ రైట్ అనే సంస్థ ముందుకొచ్చాయి. ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం వర్క్ ఆర్డర్ ఇచ్చింది. జనవరి 18న కంటివెలుగును ప్రారంభిస్తామని, ఆలోగా ప్రతి పీహెచ్‌సీకి రీడింగ్ గ్లాసెస్ చేరాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జనవరి మొదటి వారానికి 15 లక్షల అద్దాలు సరఫరా చేయాలని నిబంధన విధించింది. ఆకృతి, ైస్టెల్ రైట్ సంస్థలు గడువులోగా అద్దాలను అందజేశాయి. స్థానికంగా ఉత్పత్తి అవుతుండటం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెప్తున్నారు.
మేకిన్ ఇండియా అంటూ ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి దేశీయంగా ఏ ఉత్పత్తినీ సాధించింది లేదు. ఇప్పటికీ చైనాపై ఆధారపడుతూనే ఉన్నారు. దేశంలో కొత్తగా నెలకొల్పిన పరిశ్రమ మచ్చుకు ఒక్కటి కూడా లేదు.
మొదటి విడత కంటివెలుగు పథకం అమలు సమయంలో చైనాపై ఆధారపడినా, రెండో విడత కల్లా స్థానికంగానే కంటి అద్దాల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. 50 లక్షల అద్దాలు అవసరం కాగా అందులో సగం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. శివారులోని సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్ ఫలితాలిస్తున్నది. కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం నేడు లక్షలాది మందికి కంటిచూపైంది. మరెందరికో ఉపాధి మార్గమైంది.
రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగడుగునా ప్రోత్సహిస్తున్నది. మెడికల్ డివైజెస్ పార్క్‌లో కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో మద్ధతు ఇచ్చింది. ఇప్పుడు అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమం కంటివెలుగులో మమ్మల్ని భాగస్వాములను చేసింది. స్థానికంగా ఉన్న కంపెనీలను ప్రోత్సహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మా కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మీరు నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయండి, మేం కచ్చితంగా ప్రోత్సహిస్తాం అని ఆనాడు చెప్పారు. కంటివెలుగు వర్క్ ఆర్డర్‌తో మాటను నిలబెట్టుకున్నారు. మాకు ఆర్డర్ రావడానికి సహకరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు సైతం ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు మా దగ్గర 400 మంది పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలో మరింత పెంచుతాం.
– డాక్టర్ కుల్దీప్, ఆకృతి సంస్థ ఎండీ
మాది సుల్తాన్పూర్. మూడేండ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఆకృతి సంస్థ ఏర్పాటు కావడంతో మాకు ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కలిగింది. థ్యాంక్స్ టు కేసీఆర్ సర్.
– దశరథ్, ఉద్యోగి, సుల్తాన్ పూర్
మా కంపెనీ నుంచి అద్దాలు తెలంగాణ ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నాం. మేం తయారు చేసిన అద్దాలు అందరూ వాడుతున్నారన్న సంతోషం ఎక్కువగా ఉన్నది. ఊరు నుంచి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి దొరుకుతున్నది.
– రమ్య, ఉద్యోగి, మాదారం
ప్రభుత్వం మా ప్రాంతంలో మెడికల్ డివైజెస్ పార్క్ పెట్టడం వల్ల మాకు ఇక్కడే ఉద్యోగం దొరికింది. కంపెనీలో స్థానికులకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు.
– నవీన్, ఉద్యోగి, నల్లవల్లి