PM Modi | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ర్టాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయని పదే పదే చెబుతున్న కేంద్రం… తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేసేస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 14 మంది ప్రధానమంత్రులు పాలించారు. అందరూ కలిసి 67 ఏండ్లలో రూ.55.87 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తొమ్మిదేండ్లలో 100 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. 2014కు ముందు కేంద్రం ఏటా రూ.83 వేలకోట్ల అప్పు చేస్తే… మోదీ వచ్చాక నెలకే రూ.93 వేల కోట్లకుపైగా అప్పులు చేస్తున్నారు. అర్థం పర్థం లేని ఆర్థిక విధానాలతో దేశం వందేండ్ల వెనక్కు వెళ్లిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ.. మోదీలో ఏమాత్రం మార్పు రాలేదు. దేశాన్ని మరింత ఆర్థిక పతనం వైపు నెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అప్పుల కట్టడికి, ఆర్థిక క్రమశిక్షణకు గానూ రూపొందించిన ఎఫ్ఆర్బీఎం చట్టానికి అతీతులం అన్నట్టుగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తిలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఎప్పుడో దాటేసిందని అర్థమవుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం అప్పులు రూ.105 లక్షల కోట్లు. అప్పటికి జీడీపీలో కేంద్రం చేసిన అప్పులు 52 శాతం. 2020-21వ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం అప్పులు రూ.122 లక్షల కోట్లు. ఆ ఏడాదికి జీడీపీలో అప్పులు 61 శాతంగా ఉన్నాయి. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం చేసిన అప్పులు 9 శాతానికిపైగా పెరిగాయి. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మొత్తం అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం చూస్తే జీడీపీలో దేశం చేసిన అప్పు 58 శాతానికి పెరిగిపోయింది. ఎఫ్ఆర్బీఎం పరిమితి కంటే 18 శాతం ఎక్కువగా కేంద్రం అప్పులు చేసేసింది.
తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదని, ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు చేస్తున్నదని కేంద్రం పదే పదే ఆరోపిస్తున్నది. బీజేపీ పెద్దలు రాష్ర్టానికి వచ్చినప్పుడల్లా లెక్కా పత్రం లేని ఆరోపణలు చేసేసి వెళ్లిపోతున్నారు. ఇక.. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అప్పుల భారం పెరిగిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. అయితే.. కేంద్రం కంటే తెలంగాణ ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో మెలుగుతున్నదని లోక్సభ సాక్షిగా కేంద్రమే అంగీకరించింది. మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో ఆర్థిక ప్రణాళికతో ముందుకెళుతున్నదని, పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నదని కేంద్రమే తెలిపింది. 2021 నుంచి 2023 వరకు జీఎస్డీపీలో రాష్ర్టాల అప్పులను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవలే వివరించారు.
తెచ్చిన అప్పులతో ప్రపంచమే అబ్బురపడేలా తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అప్పు తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్తు తరాల కోసం వెచ్చించింది. తద్వారా తలసరి ఆదాయం, జీఎస్డీపీ గణనీయంగా పెరిగాయి. మరి.. కేంద్రం ఏం చేసింది? తొమ్మిదేండ్లలో మోదీ 100 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి లక్షల కోట్లు ఖజానాలో వేసుకున్నారు. ఈ లక్షల కోట్లతో మోదీ సృష్టించిన ఆస్తులు ఎన్ని? మరోవైపు… పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్పై పన్నులు, సెస్సులు విధించి ప్రజల సొమ్మును ముకు పిండి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు? ఇదీ.. ప్రస్తుతం దేశ ప్రజలను వేధిస్తున్న లక్షల టన్నుల ప్రశ్న?