హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ప్రాజెక్టుకు 4.86 లక్షలు, నాగార్జునసాగర్‌కు 5.46 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రకాశం బరాజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదయింది. 2009లో రికార్డు స్థాయి ప్రవాహం 10లక్షల క్యూసెక్కులుండగా తాజాగా ఆదివారం రాత్రి 10.10 లక్షల క్యూసెకులు నమోదయింది. ప్రకాశం బరాజ్ 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ 10 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎల్లంపల్లికి 2.92 లక్షల ప్రవాహం కొనసాగుతున్నది. మున్నేరు, ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 275చెరువులు, కాలువలకు గండ్లుపడగా, రూ.700కోట్ల మేరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు ఇరిగేషన్‌శాఖ అధికారులు నిర్ధారించారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 62చెరువులు, ములుగు జిల్లాలో 42, ఖమ్మం జిల్లాలో 38, సూర్యపేట జిల్లాలో 32 చెరువులు, కాలువలు గండిపడినట్లు తెలిపారు. 275 గండ్లలో దాదాపు 150 మేరకు చోట్ల తక్షణ మరమ్మతులు చేట్టినట్లు వివరించారు.