దేవరుప్పుల, మే 22: విజన్ లేని పార్టీగా కాంగ్రెస్, పరమతాన్ని ఆదరించలేని పార్టీగా బీజేపీని తెలంగాణ సమాజం విశ్వసించదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి, పెదతండా కేంద్రాలుగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆణిముత్యాలు గా నిలిచాయని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశ ప్రజలను, వివిధ పార్టీలను ఆలోచింపజేస్తున్నాయని తెలిపారు. అనతి కాలంలోనే దేశా న్ని సాకే అతి కొద్ది రాష్ర్టాల జాబితాలో తెలంగాణ చేరడం ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని విమర్శించారు.
ఎన్నికలు దగ్గరపడుతు న్న వేళ పార్టీ శ్రేణులు కేసీఆర్ పథకాలపై పూర్తి అవగాహనతో ఉండాలని, ఊరూరా ఏ పథ కం ఎవరికి వచ్చిందనే లెక్కలు తెలిసి ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఇక ఇతర పార్టీల వారు బీఆర్ఎస్ను, కేసీఆర్ను విమర్శిస్తే గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు, లబ్ధిదారుల చిట్టా చదవాలని, వారి మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చా రు. ఇక్కడ ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేవని అన్నారు. కేంద్రం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చూ స్తున్నదని, అదే జరిగితే ఏడాదికి ప్రతి రైతు రూ.లక్ష చొప్పున బిల్లు చెల్లించాల్సి వ స్తుందని తెలిపారు. మీటర్లు పెట్టాలనే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిప్పికొట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను మరో దశాబ్దం తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుంటారని తెలిపారు.