హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభం కానున్నది. ఓటర్ల సమగ్ర వివరాల సేకరణ, మ్యాపింగ్ ప్రక్రియకు అధికారికంగా తెరలేవనున్నది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను రా ష్ట్ర ఎన్నికల యంత్రాంగం పూర్తి చేసింది. 33 జిల్లాల పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ సాగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓటర్ల డేటాను నూటికి నూరు శాతం పకాగా మ్యాపింగ్ చేయడమే లక్ష్యంగా ఈ భారీ కసరత్తు ప్రారంభం కాబోతున్నది. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటికి వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్‌ను నేరుగా ఓటర్లకు అందించనున్నారు. ఓటర్లు ఆ ఫామ్‌లో అడిగిన వివరాలను స్పష్టంగా నింపి, తిరిగి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌తో పాటు ఆధార్‌కార్డు లేదా ఇతర ఎలాంటి ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయాల్సిన అవసరం లేదు. కేవలం సమాచారం ఇస్తే సరిపోతుంది. ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ ఫామ్‌లను విడుతలవారీగా తిరిగి తీసుకోనున్నారు. రసీదుగా మరో ఫామ్‌ను వారికి ఇస్తారు.
‘సర్’ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు వీలుగా బీఎల్వోలకు గట్టి పోలీసు బందోబస్తును కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇండ్లను గుర్తించడంలో, స్థానికులకు అవగాహన కల్పించడంలో స్థానిక గ్రామ అధికారులు కూడా బీఎల్వోలకు పూర్తిస్థాయిలో సహకరించనున్నారు. బీఎల్వోలను ఓటర్లు గుర్తించేందుకు వీలుగా వారికి ప్రత్యేక గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఒక్కో పోలింగ్‌బూత్ పరిధిలో గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లు ఉంటారు. ఒక్కో బీఎల్వోకు 1,200 ఓటర్లను కేటాయించారు. తొలిరోజు నుంచే బీఎల్వోలు వారికి కేటాయించిన పోలింగ్‌బూత్ పరిధిలోని ఓటర్ల ఇండ్లకు వెళ్లి వారికి ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందజేస్తారు.
ఎన్యుమరేటర్ ఫామ్‌ను నాలుగు విభాగాలుగా నింపాల్సి ఉంటుంది. గత ‘సర్’ ఓటర్ల జాబితాలోని ఓటరు వివరాల ఆధారంగా ఒక భాగం, గత ‘సర్’లో ముందుకాలంలో పేర్కొన్న బంధువు (తండ్రి/తాత) వివరాలతో రెండోభాగం, గత ఓటరు జాబితాలో ఎలాంటి వివరాలు లేకపోయినా ఆ వివరాలతో మూడోభాగం, పైన చెప్పిన వివరాలు వాస్తవమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేసి నాలుగో భాగాన్ని నింపాల్సి ఉంటుంది. రెండు ఫామ్‌ల మీద వివరాలు రాసి సంతకాలు చేసి ఒకటి రసీదుగా ఓటరు తీసుకొని, మరొకటి బీఎల్వోకు ఇవ్వాలి. ఇలా ఎన్యుమరేటర్ ఫామ్ నింపి బీఎల్వోకు అందజేయడానికి గురువారం నుంచి జూలై 24వ తేదీవరకు ఓటర్లకు అవకాశం ఉన్నది. వీలైతే ఓటరు తమ కొత్త ఫొటో ఇవ్వవచ్చు. లేదంటే బీఎల్వోను ఫొటో తీసుకోవాలని ఓటరు కోరవచ్చు.
ఎన్యుమరేటర్ ఫామ్‌లో ఓటరు నింపిన అన్ని వివరాలు సక్రమంగా ఉంటే జూలై 31న ప్రచురించే ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాలో పేరు ఉంటుంది. పోలింగ్స్టేషన్లవారీగా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నదా లేదా అనే విషయాన్ని చూసుకోవచ్చు. మొత్తం 1,200 మంది ఓటర్లలో వివరాలు తెలియని, గణన ఫామ్ ఇవ్వనివారి పేరు ఉండదు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఎన్నికల అధికారులకు తెలియజేయవచ్చు. వివరాలు సక్రమంగా నింపని ఓటర్లకు కూడా నోటీసులు వస్తాయి. అలాంటివారి వివరాలను ప్రత్యేకంగా ప్రచురిస్తారు. ఓటర్ల అభ్యంతరాలను జూలై 31 నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు పరిష్కరిస్తారు. అక్టోబర్ 1న ఓటర్ల తుదిజాబితాను ప్రచురిస్తారు.
రాష్ట్రంలో మొత్తం 3,38,29,018 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 2,36,54,232 మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ అయ్యాయి. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల మ్యాపింగ్ 71 శాతమే నమోదైంది. మిగిలిన 30 శాతం మందిని కూడా ఓటరు జాబితా పరిధిలోకి తెచ్చి, వంద శాతం మ్యాపింగ్ పూర్తిచేయడమే ‘సర్’ ముఖ్యఉద్దేశం. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (12 ఎస్టీ, 19 ఎస్సీ, 88 జనరల్) ఈ ప్రక్రియ ఏకకాలంలో జరుగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,985 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్తారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 14,750, గ్రామీణ ప్రాంతాల్లో 21,157 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 1,200 ఓట్లకుపైగా ఉన్న పోలింగ్ కేంద్రాలు 28,662 ఉండగా, 1,200 కంటే తక్కువ ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 7,323 ఉన్నాయి. ఈ భారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 33 మంది జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), 119 మంది ఈఆర్వోలు, 3,596 మంది బీఎల్వో సూపర్వైజర్లు రంగంలోకి దిగుతున్నారు. బూత్ లెవెల్ అధికారులకు సాయంగా 49,018 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రత్యక్షంగా సర్వేలో పాల్గొని ఓటర్ల ఇండ్లను సందర్శిస్తారు.
ఓటర్ల జాబితా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా రాష్ట్రంలో సుమారు 89.88 లక్షల మంది ఓటర్ల వివరాలలో కొన్ని తారిక వ్యత్యాసాలు ఉన్నట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు. సగటున రాష్ట్రంలో 37.67 శాతం ఓటర్ల డాటాలో తప్పులు ఉన్నాయి. తల్లిదండ్రులు-పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసాలు తప్పుగా ఉండటం, భార్యాభర్తల/తండ్రి పేర్లలో రికార్డుల మధ్య తేడాలుండటం, గత రికార్డులకు ప్రస్తుతానికి ఓటరు వయస్సులో తేడాలుండటం, ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వంటి 11 రకాల తప్పులను గుర్తించారు. ఈ వ్యత్యాసాలను సరిదిద్దేందుకు సదరు ఓటర్లందరికీ ఈసీవో కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేస్తారు. పోలింగ్ స్టేషన్లవారీగా జూలై 31న ఓటర్ల డ్రాఫ్ట్ (ప్రాథమిక) జాబితా ప్రచురిస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నదా లేదా అనే విషయాన్ని <> లో చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఓటర్లు టోల్ ఫ్రీనంబర్ 1950ను సంప్రదించవచ్చు, లేదా <> వెబ్సైట్ ద్వారా లేదా, ఈసీఐనెట్ యాప్‌లో అందుబాటులో ఉన్న ‘బుక్ ఏ కాల్ విత్ బీ ఎల్వో’ సదుపాయాన్ని కూడా ఓటు నమోదుకు వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.