హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలుగు వెలుగులో తెలంగాణ రాష్ట్రం శోభించాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. ప్రజాకవి కాళోజీ జయంతి రోజైన సెప్టెంబర్ 9న నిర్వహించే తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ భాష చైతన్య వేదిక కావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాహితీ దిగ్గజాల జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. రోజువారీ వ్యవహారాల్లో తప్పనిసరిగా తెలుగునే వినియోగించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగు భాషలోనే జరపాలని కోరారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు భాషా సంఘం తరఫున మెయిల్స్ పంపించామని చెప్పారు. తెలుగు భాషపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని ఆదర్శంగా తీసుకొని మనమంతా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ విషయంలో కవులు, రచయితలు, వాగ్గేయకారులు, పాత్రికేయులు, మేధావులు, విద్యావేత్తల సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు.