హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తేతెలంగాణ): తన మనిషిని గెంటేశాడన్న నిందమోపి సీఐ, ఎస్ఐలు, హోంగార్డులను దూషిస్తూ దాడికి దిగిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసు అధికారులు బుజ్జగించడం దుర్మార్గమని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఈ వ్యవహారం రేవంత్‌రెడ్డి పాలనలో పోలీసులకు జరిగిన ఘోర అవమానమని పేర్కొన్నారు. పోలీసులపై దాడికి యత్నించిన జగ్గారెడ్డి ఘటనపై బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కేసు నమోదు చేయకుండా జగ్గారెడ్డిని ప్రాధేయపడటం రాష్ట్రంలో అడుగంటిన పోలీసుల ఆత్మైస్థెర్యాన్ని సూచిస్తున్నదని పేర్కొన్నారు. ఏ పాపం ఎరుగని సోషల్ మీడియా యాక్టివిస్టులపై చీటికి మాటికి చిల్లర కేసులు పెట్టి జైలుకు పంపించి, సుప్రీంకోర్టులో కోట్లకు కోట్లు ప్రజాధనం వృథా చేస్తున్న తెలంగాణ పోలీసులు తమపై దాడికి యత్నించిన జగ్గారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వేలాదిమంది పోలీసులకు, హోంగార్డులకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.