హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం కేవలం ఏడాది కాలానికి కుదిరిన తాత్కాలిక ఒప్పందం మేరకు 34ః66 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపకాన్ని ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును నిలదీసింది. ఈ నీటి సంవత్సరంలో 34ః66 నిష్పత్తిలో నీటిని పంచుకొనేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం త్వరగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి, నీటి వాటాలను తేల్చాలని, అప్పటివరకు 50ః50 నిష్పత్తిలో కృష్ణా జలాలను వినియోగించుకొంటామని తెగేసి చెప్పింది.
కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జలసౌధలో బోర్డు 16వ సమావేశం జరిగింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాడిగా, వేడిగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మొత్తం 16 అంశాలపై కూలంకషంగా చర్చించాయి. నీటి వాటాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్తు ఉత్పత్తి, డ్యామ్‌ల భద్రత తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదనలను వినిపించింది. ఎజెండాలో పొందుపరచిన పలు అంశాలపై ఇరు రాష్ర్టా లు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై బోర్డులో నిర్దేశించుకొన్నాయి.
ట్రిబ్యునల్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి..
కృష్ణా జలాలను 34ః66 నిష్పత్తిలో వినియోగించుకొనేందుకు 2015-16లో కేవలం ఏడాది కాలానికి కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని సంవత్సరాల తరబడి పొడిగించడంపై తెలంగాణ సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ఈ నిష్పత్తిలో జలాల వినియోగానికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై చర్చ అర్ధంతరంగా ముగిసింది.
సీఈ రవికుమార్ పిైళ్లెపై రజత్‌కుమార్ ఆగ్రహం
బోర్డు సమావేశంలో రజత్‌కుమార్, డిప్యుటేషన్‌పై కేఆర్ఎంబీలో విధులు నిర్వర్తిస్తున్న సీడబ్ల్యూసీ సీఈ రవికుమార్ పిైళ్లె మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ట్రిబ్యునల్ ఏర్పాటు, సమ నిష్పత్తిలో నీటి వినియోగం, డీపీఆర్‌ల సమర్పణ, ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్ తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా రవికుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రజత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ఆధారిత ప్రాజెక్టులకు అనుమతిచ్చేందుకు సీడబ్ల్యూసీ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని, అలాంటప్పుడు డీపీఆర్‌లను ఎలా సమర్పించాలని నిలదీశారు.
బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
ఎజెండాలోని పలు అంశాలపై అధ్యయనం కోసం ఇద్దరు కేఆర్ఎంబీ మెంబర్లు, ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు, హైడల్ పవర్ సీఈలతో కలిపి ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన ప్రొటోకాల్‌పై 15రోజుల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలి. వాటిని బోర్డులో ఆమోదింపజేసుకోవాలి.
అదేవిధంగా ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు రూల్ కర్వ్‌ను రూపొందించాలి. అంశాలవారీగా, ప్రాజెక్టుల వారీగా నెలరోజుల్లోగా నిర్ధారించాలి.
డ్యామ్ సేఫ్టీపై మార్గదర్శకాలు ఇవ్వాలి.
పులిచింతల డ్యామ్ గేట్ ఎలా కొట్టుకుపోయిందనే అంశంపై నివేదికను అందజేయాలి.
కృష్ణా బేసిన్‌లోని వరద ఆధారిత ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులపై తెలంగాణ, ఏపీ రిపోర్టును అందజేయాలి.
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలి. ఆ తర్వాత మరమ్మతులకు అవసరమయ్యే నిధుల ఖర్చుపై ఇరు రాష్ర్టాలు మరోసారి సమావేశం కావాలి.