హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ‘పిల్లలు ఆరోగ్యంగా ఎదిగితేనే భవిష్యత్తులో తెలంగాణ బలంగా ఉంటుంది’.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చేసే వ్యాఖ్యలు ఇవి. అందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాతాశిశుమరణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మరణాల రేటును తగ్గించేందుకు ప్రత్యేకంగా ‘కేసీఆర్ కిట్’, ‘న్యూట్రిషన్ కిట్’ పథకాలు ప్రవేశపెట్టారు. ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగా అమలు చేశారు. దీనికితోడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యవసతులు మెరుగుపరిచారు. ఫలితంగా మాతాశిశుమరణాలు గణనీయంగా తగ్గాయి. నాడు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయని తాజాగా మరోసారి నిరూపితమైంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్)-2024 ప్రకారం రాష్ట్రంలో శిశుమరణాల రేటు(ఐఎంఆర్) 17గా నమోదైంది. 2014లో ప్రతి వెయ్యి జననాలకూ 35గా ఉన్న శిశు మరణాల రేటు 2024 నాటికి సగానికిపైగా తగ్గి, ఆదర్శంగా నిలిచింది. 2024లో ఐఎంఆర్ జాతీయ సగటు 24గా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అత్యధిక శిశు మరణాల రేటు నమోదవుతున్నదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 36, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో 35 ఐఎంఆర్తో దేశంలోనే అత్యధిక శిశుమరణాలు నమోదవుతున్న రాష్ర్టాలుగా నిలిచాయి. బీజేపీ పాలిత అసోం 29, రాజస్థాన్ 28 తదితర రాష్ర్టాల్లోనూ ఐఎంఆర్ భారీగా నమోదవుతున్నది.
గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే మాతాశిశు మరణాల రేటు తగ్గించగలమని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. వివిధ రాష్ర్టాల్లో అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేయించి.. నివేదికలు తెప్పించుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కిట్‌కు రూపకల్పన చేశారు. నిరుపేద, మధ్యతరగతి గర్భిణులను ఆదుకోవాలనే మానవీయ కోణంతోపాటు సామాజిక మార్పు, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నవజాత శిశువులను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని 2017 జూన్ 2న ప్రారంభించారు. ఈ పథకం కింద గర్భిణులకు గరిష్ఠంగా రూ.15వేల ఆర్థిక సాయం అందించారు. మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేల నగదు చొప్పున అందించారు.
దీంతోపాటు రూ.2వేల విలువైన కిట్ అందజేశారు. ఈ కిట్‌లో బాలింత, నవజాత శిశువుకు ఉపయోగపడే 14 రకాల వస్తువులు పొందుపరిచారు. దోమతెర, బేబీ ఆయిల్, బేబీ సోప్, బేబీ క్రీమ్, బేబీ షాంపూ, రెండు టవళ్లు, బేబీ న్యాప్కిన్స్, 2 జతల దుస్తులు, సోప్ బాక్స్, ఆట వస్తువులు, తల్లి కోసం రెండు చీరలు, రెండు సబ్బులు, కిట్ బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్ వంటివి కిట్ రూపంలో అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకంతో రాష్ట్రంలో 13,90,636 మంది గర్భిణులు, రూ.1,262 కోట్ల మేర లబ్ధి పొందారు. దీంతో మాతాశిశు సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు ‘కేసీఆర్ కిట్’ నాంది పలికినట్టయింది.
పథకం ప్రారంభం – 2017 జూన్ 2
మొత్తం లబ్ధిదారులు – 13,90,636
చేసిన ఖర్చు – రూ.1,262 కోట్లు
గర్భిణులకు కేసీఆర్ కిట్ అందజేసిన కొన్ని జిల్లాల్లో మాతాశిశుమరణాల రేటు నియంత్రణలోకి రాలేదు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేయగా, గర్భిణులకు పోషకాహారం అందడం లేదని గుర్తించారు. అంగన్వాడీల ద్వారా ఆరోగ్యలక్ష్మీ పథకం కింద పోషకాహారం అందిస్తున్నా, సరిపోవడం లేదని తెలుసుకున్నారు. ముఖ్యంగా రక్తహీనత వేధిస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. దీంతో గర్భిణుల కోసం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకానికి రూపకల్పన చేశారు. 2022 డిసెంబర్ 21 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. ముందుగా అత్యధిక రక్తహీనత ప్రభావిత జిల్లాల్లో ఈ స్కీమ్ ప్రారంభించారు.
తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. ఒక్కో న్యూట్రిషన్ కిట్‌లో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, ఆల్బెండజోల్ ట్యాబెట్లు, కప్పు, ప్లాస్టిక్ బాటిల్ అందజేశారు. ఒక్కో గర్భిణికి రెండు చొప్పున కిట్లు సరఫరా చేశారు. ఈ పథకం అద్భుత ఫలితాలు ఇవ్వడంతోపాటు మహిళలను రక్తహీనత సమస్య నుంచి బయటపడేసింది. ఈ రెండు పథకాలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. రాష్ట్రంలో మాతాశిశుమరణాలు క్రమంగా తగ్గాయి. తాజాగా ఎస్ఆర్ఎస్ విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శనం.
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రెండు పథకాలను రేవంత్ ప్రభుత్వం నిలిపివేసింది. కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో మొదట న్యూట్రిషన్ కిట్‌ను ఆపేసింది. గర్భిణుల నుంచి వ్యతిరేకత రావడంతో పథకంపై అవినీతి ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే కేసీఆర్ కిట్ అమలును సైతం నిలిపివేసింది. మదర్ అండ్ చైల్డ్ హెల్త్(ఎంసీహెచ్) కిట్‌గా పేరు మార్చి అమలు చేస్తామని చెప్పినా.. నేటికి ఈ పథకం అమలు కావడం లేదు. దీంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం జరిగితే ఇచ్చే ఆర్థిక సాయాన్ని సైతం రేవంత్ ప్రభుత్వం నిలిపివేసింది.
వాస్తవానికి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ కిట్‌ను ఆదర్శంగా తీసుకుని ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ అనే పేరుతో అమలు చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది. ఎస్ఆర్ఎస్ నివేదిక చూసైనా కండ్లు తెరువాలని, ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు వెచ్చించే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మానవీయ కోణంలో ఆలోచించి కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
