హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 13వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారరెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నది.
గడిచిన 24గంటల్లో నారాయణపేట్, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వనపర్తి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురువగా, అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 2.60 సెం.మీ వర్షపాతం కురిసినట్టు తెలిపింది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో 2.20 సెం.మీ, బిజినేపల్లిలో 1.70 సెం.మీ, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్లో 2.12 సెం.మీ, మూసాపేటలో 2.06 సెం.మీ, మహబూబ్‌నగర్ రూరల్‌లో 1.87 సెం.మీ, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 1.72 సెం.మీ, వనపర్తి జిల్లా ఘనపూర్‌లో 1.84 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.