హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచస్థాయి గుర్తింపు పొందగలిగిన ప్రదేశాలు తెలంగాణలో అనేకం ఉన్నాయని, కేంద్రం వాటి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. కేంద్రం కొన్ని రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం చాలా సంతోషమని అన్నారు. ఇక్కత్ చీరలకు పోచంపల్లి ప్రసిద్ధిగాంచిందని, 2005లోనే జీఐ గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నరేండ్లలోనే రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించామని చెప్పారు. త్వరలోనే బుద్ధవనాని కి అంతర్జాతీయ గుర్తింపు రాబోతున్నదని వెల్లడించారు. రామప్ప ఆలయ అభివృద్ధికి రూ.300 కోట్లు, సమ్మక్క సారక్క జాతరకు రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ, ఏపీలో పర్యాటకరంగం అభివృద్ధిపై రవాణా, టూ రిజం, సాంస్కృతికశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టీజీ వెంకటేశ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని కొవిడ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పర్యాటకరంగాన్ని కేంద్రం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.