హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయలాంటి సచివాలయానికి మంచినీటి సరఫరాను కాంట్రాక్టర్లు నిలిపేయడం సంచలనంగా మారింది. కాంట్రాక్ట్ సంస్థలు నీటి సరఫరా నిలిపేయడంతో సిబ్బందితోపాటు ఆయా పనుల నిమిత్తం వచ్చే సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. సచివాలయంలోని మంత్రుల పే షీలు, అనుబంధ కార్యాలయాలకు సరఫరా చేసిన తాగునీటి బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీలు ప్రస్తుతం బంద్ పెట్టినట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మంత్రుల పేషీలు, అనుబంధ కార్యాలయాలకు 20 లీటర్ల ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్లతోపాటు, రూ.7 విలువ గల చిన్న వాటర్ బాటిళ్లను నాలుగు కాంట్రాక్ట్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వం ఆ ఏజెన్సీలకు చెల్లించాల్సిన మొత్తం రూ.50 లక్షలకు చేరినట్టు తెలిసింది. బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్టు తెలిసింది. బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామని పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టినట్టు సమాచారం.
తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో సచివాలయ సిబ్బందిని ఇండ్ల నుంచే వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం సచివాలయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇటీవల బిల్లులు చెల్లించలేదనే కారణంగా మధ్యాహ్న భోజనాన్ని సైతం కాంట్రాక్టర్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సరఫరా నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలోగా బకాయిలు చెల్లిస్తారో.. ఎప్పటినుంచి మంచినీటి సరఫరా పునరుద్ధరిస్తారోనని ఉద్యోగులు సోమవారం చర్చించుకోవడం క నిపించింది.
బకాయిలు చెల్లిస్తేనే ప్యూరిఫైడ్ వాటర్ సైప్లె చేస్తామని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి తేల్చిచెప్తున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన సచివాలయానికే మంచినీటి బకాయిల కారణంగా నీటి సరఫరా నిలిచిపోవడం సచివాలయ వర్గాలతోపాటు, సచివాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సందర్శకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారులు మాత్రం ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం.