వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, నమస్తే తెలంగాణ/పెద్దమందడి, ఆగస్టు 29: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్-3 ప్రకారమే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేసి పేదలకు మెరుగైన విద్యను అందిస్తున్నామని స్పష్టంచేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇక్కడి పథకాలు అమలవుతున్నాయా? అని ఆయ న ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అంతకుముందు వనపర్తిలో నీటిపారుదల శాఖ అధికారులతో ఎంజీకేఎల్, డీ-8 కాలువపై మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు సాగుకు సరిపడా నీరు వచ్చేలా అన్ని పంపులను నడిపించాలని ఆదేశించారు.