హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతు బీమా పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.800 కోట్లు చెల్లించింది. ముందస్తుగా నిధులు విడుదల చేస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత ప్రీమియం గడువు ఈ నెల 13తో ముగియనున్నది. 14 నుంచి కొత్త ప్రీమియం అమల్లోకి రానున్నది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీకి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియంకోసం ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి అర్హులైన కొత్త రైతులు రైతుబీమా పథకానికి ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది.