నడిగూడెం, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాక ముందు.. వచ్చాక గ్రామాల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తెలిపారు. అభివృద్ధి పనుల ప్రభావం, ప్రజల జీవన విధానం, మానవ సంబంధాలపై రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం నడిగూడెం మండలం సిరిపురంలో ‘మన ఊరు- మన చరిత్ర’పై చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకొకరు చొప్పున 33 మంది జిల్లా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారితో 12,769 గ్రామాల్లో సర్వే చేపడుతున్నామని చెప్పారు. డిగ్రీ విద్యార్థులు సర్వే చేపట్టి మౌలిక వసతులు, అన్ని శాఖల అభివృద్ధి ఫలాలు, విద్య, వైద్యం, సాగునీరు, వ్యవసాయం తదితర అంశాలను సేకరించనున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 700 గ్రామాల చరిత్రను సేకరించగా, నల్లగొండ జిల్లాలో 250 గ్రామాల్లో సర్వే పూర్తయిందని అన్నారు.