హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తెలుగు భాష సంపూర్ణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు భాషపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ సాహిత్య అకాడమీని పునరుద్ధరించారని చెప్పారు. మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో కవులు, రచయితల సమ్మేళన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. మాతృభాష పరిరక్షణలో భాగంగా అకాడమీ ఆధ్వర్యంలో ‘మన ఊరు-మన చెట్లు’ అంశంపై కథల పోటీలు నిర్వహిస్తే ఐదు లక్షల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. తెలుగు టీవీ చానళ్లలో సులభమైన తెలుగు పదాలను వాడాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషకు పరిపూర్ణమైన తోడ్పాటును అందిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, ప్రముఖ కవయిత్రి జ్వలిత, సలీమ, ప్రముఖ రచయితలు రూప్‌కుమార్, కందుకూరి శ్రీరాములు, చీకోలు సుందరయ్య, తంగిరాల చక్రవర్తి, షెహనాజ్బేగం, నారాయణశర్మ, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.