TS Minister Gangula | ఢిల్లీ గులాములకు సభ్యులు మోసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే తెలంగాణ అంధకారం అవుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 47, 31, 50, 10 డివిజన్లలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు సమైక్య పాలనలో నీళ్ల కోసం కరెంటు కోసం అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, వంగి పోయిన కరంట్ స్తంభాలు దర్శనం ఇచ్చాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మళ్లీ వస్తున్నారని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో సురక్షితంగా ఉంటుందన్నారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రూ.2000 పెన్షన్‌ను దశలవారీగా రూ.5000 చేసుకుంటామని.. రూ.1100 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ రూ.400లకే అందజేస్తామన్నారు. రూ.లక్ష ఉన్న కళ్యాణ లక్ష్మిని రూ. 2లక్షలు చేసుకుంటామని మంత్రి గంగుల చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే అని.. బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని ముస్లింల ఓట్లు చీల్చేందుకు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. కాంగ్రెస్ టికెట్ పురమల్ల శ్రీనివాస్‌కు ఇప్పించాడని ఆరోపించారు. గుండె నొప్పితో డ్రామాలాడి ఎంపీ ఎన్నికల్లో గెలిచి నగర అభివృద్ధికి ఒక పైసా కూడా తేలేదని అన్నారు.. కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కనుక అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజులు తన కోసం పని చేస్తే వచ్చే ఐదేండ్లు మీకోసం పని చేస్తానని గంగుల వెల్లడించారు..
ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. కార్పొరేటర్లు షర్ఫు, లెక్కల సప్న వేణుగోపాల్, కొలిపాక అంజయ్య, నాయకులు నలువాల రవీందర్ దుడ్డెల శ్రీధర్, దుడ్డెల ప్రశాంత్, బాబు జానీ, నేతి మాధవి, రవి వర్మ, ఎంఐఎం అధ్యక్షుడు హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బా షమీ, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.