హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ): లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారుల వాహనాలపై దాడి ఘటన సరికాదని పేర్కొన్నారు. దాడి ఘటనతో లగచర్లలో కరెంటు సరఫరా నిలిపివేసి, ఇంటర్నెట్ను నిలిపివేయడాన్ని ఖండించారు. గిరిజన రైతులను అరెస్టులతో ఇబ్బందికి గురి చేయొద్దని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా కంపెనీల ఏర్పాటును రద్దు చేయలేదని కోర్టులో చెప్పిన పాలకులు.. కొడంగల్లో ఎందుకు భూములు సేకరిస్తున్నారని ప్రశ్నించారు.
లగచర్ల రైతులకు అండగా ఉంటాం ; తెలంగాణ ఉద్యమ వేదిక
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : లగచర్ల ఘటనను అధికారులపై దాడి అనకూడదని వికారాబాద్ కలెక్టర్ స్వయంగా ప్రకటించినా జిల్లా అధికారులు ధర్నాలెందుకు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమ వేదిక ప్రశ్నించింది. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ, భూ దోపిడీ వ్యవస్థకు అనుకూలంగా ఉండొద్దని మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది. ఫార్మా కంపెనీ తమకొద్దని లగచర్ల రైతులు ఎన్నో రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించిస్తున్నదని పేర్కొంది. దీంతో ఏమీ చేయలేని స్థితిలో రైతులు ఆగ్రహానికి గురయ్యారని వెల్లడించింది. రైతుల పక్షాన తెలంగాణ ఉద్యమ వేదిక ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోరాటాల రామన్న వెల్లడించారు. రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటాలు చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల మాట వినాలని, వారి భూముల జోలికి రావొద్దని సూచించారు.