వరంగల్, ఏప్రిల్ 24 (నమేస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్టీసీ నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ (55) బలిదానంతో వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం రోజంతా ఎమర్జెన్సీని తలపించింది. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంనాటి కన్నా మిన్నగా కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ వైఖరిని ప్రదర్శించింది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి జిల్లా కల్లోలిత ప్రాంతాన్ని తలపించింది. క్షణక్షణం ఉద్రిక్త వాతావరణం కనిపించింది. రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న మొండివైఖరితో శుక్రవారం రాష్ట్రమంతా అట్టుడికిపోయింది.
శంకర్‌గౌడ్ సమ్మె రెండోరోజు నర్సంపేట డిపో వద్ద సమ్మెలో పాల్గొన్నాడు. సర్కార్ తమ కోర్కెలు తీర్చడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై తోటి కార్మికులు చూస్తుండగానే శరీరంపై పెట్రోల్ చల్లుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నర్సంపేటలో ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించడం, అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసమని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి దవాఖానకు తీసుకెళ్లి.. తెల్లవారుజామున అత్యంత రహస్యంగా కుటుంబసభ్యులు తేరుకోకముందే లాంఛనాలన్నీ పూర్తిచేసి నర్సంపేటకు తరలించేదాకా సర్వం తానై సర్కార్ హైడ్రామా నడిపింది. ఆర్టీసీ డ్రైవర్ బలిదానం సమాచారంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం తెల్లారింది. అప్పటి నుంచి తిరిగి శుక్రవారం సాయంత్రం దాకా పోలీసుల అనుమతితోనే వరంగల్ గాలి పీల్చుకున్నదా? అన్నట్టే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న తర్వాత గురువారం రాత్రి హైడ్రామా నడిచింది. నర్సంపేట ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. 80శాతం కాలిన గాయాలతో ఉన్న శంకర్‌గౌడ్‌ను అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసమని హైదరాబాద్ డీఆర్డీవో అపోలోకు తరలించారు. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గురువారం రాత్రి 10 గంటలకే శంకర్‌గౌడ్ మరణించాడని పలు టీవీ చానళ్లు, సోషల్ మీడియా వేదికల్లో వార్తలు వెలువడ్డాయి. ఆ వెంటనే మీడియా ప్రతినిధులు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికుల, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున కంచన్‌బాగ్ దవాఖానకు తరలివచ్చారు. అక్కడ దవాఖాన పరిసరాలు ఉద్రిక్తంగా మారడంతో 12 గంటల సమయంలో శంకర్‌గౌడ్‌కు చికిత్స అందిస్తున్నామని, సీపీఆర్ చేయడంతో అతనిలో కదలికలు వచ్చాయని, ప్రాణాలతోనే ఉన్నాడంటూ వైద్యలు ప్రకటించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని మంత్రి పొన్నం రాత్రి 12 గంటల తర్వాత ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీసు, ఇతర ఉన్నతాధికారులు సందర్శించి వెళ్లిన తర్వాత ఆర్ధరాత్రి 2:35 గంటలకు శంకర్‌గౌడ్ మృతి చెందారని కుటుంబసభ్యులకు తెలిపారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆగమేఘాలపై అక్కడే ప్రత్యేక వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించి, 4:30 గంటలకు శంకర్‌గౌడ్ మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఆ తర్వాత మృతదేహాన్ని బైపాస్‌రోడ్డు గుండా (మల్లంపల్లి క్రాస్ నుంచి) నర్సంపేట సమీపంలోని ముత్తోజిపేట గ్రామానికి ఉదయం 7 గంటలలోగా భారీ బందోబస్తు నడుమ తరలించారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం దాకా ముత్తోజిపేట పోలీస్ పహారాలో ఉన్నది. ఆఖరికి పోలీస్ ఆంక్షల మధ్య అంత్యక్రియలు జరిగాయి.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతదేహం తరలింపు విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు తొలుత తోటి కార్మికులు, కుటుంబసభ్యులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. శంకర్‌గౌడ్ తన జీవితంలో 27 నుంచి 30 ఏండ్లపాటు నర్సంపేట డిపోతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడని, డిపోను సొంతిల్లులా, తోటి కార్మికులను బంధుమిత్రులుగా భావించేవాడని ఈ నేపథ్యంలో మృతదేహాన్ని డిపో వద్దకు తరలించి నివాళులర్పించి తిరిగి తీసుకొస్తామని వేడుకున్నారు. దీనికి పోలీసులు ససేమిరా అన్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శంకర్‌గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. కార్మికుల కోరిక మేరకు పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అయినా పోలీసులు ఒప్పుకోలేదు. తాము రాజకీయాలు చేయడం కోసం అడగడం లేదని, కుటుంబ సభ్యులు, కార్మికుల విజ్ఞప్తితో అనుమతివ్వాలని కోరారు. ఈ విషయంలో తాము పూర్తిగా సహకరిస్తామని, అవసరమైతే డిపో వద్దకు తాను కానీ, పార్టీ శ్రేణులు కానీ ఎవరూ రాబోమని పోలీసులకు హామీ ఇచ్చారు. అయినా పోలీసులు నిరాకరించడంతో ఒకదశలో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు.

శంకర్‌గౌడ్ మృతదేహం ఉన్న స్ట్రెచ్చర్‌ను కుటుంబసభ్యులు, కార్మికుల సాయంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి లాక్కుంటూ కొంత ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో డీసీపీ రాజ మహేంద్రనాయక్, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పెద్ది సుదర్శన్‌రెడ్డిని వ్యూహాత్మకంగా పోలీస్ వాహనం ఉన్నవైపు నెట్టేసుకుంటూ తీసుకెళ్లి క్షణాల్లో పోలీస్ వాహనం ఎక్కించారు. ఈ అనూహ్య ఘటనతో తేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ వాహనాల ముందు పడుకొని నిరసన తెలిపాయి. కార్యకర్తలను తొలగించి సుదర్శన్‌రెడ్డిని నర్సంపేట మీదుగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ పోలీస్స్టేషన్లు తిప్పుతూ రోజంతా తమ అదుపులోనే ఉంచుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కారేపల్లిలో పెద్దిని విడుదల చేశారు. నర్సంపేటలో శంకర్‌గౌడ్ అంత్యక్రియలు మొదలై వాతావరణం సాధారణస్థితికి వచ్చాక ఆయనను విడుదల చేయడం గమనార్హం. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ముత్తోజిపేటకు చేరుకొని మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తూ, ప్రభుత్వ తీరుకు నిరసన తెలుపగా పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

తోటి ఆర్టీసీ కార్మికుడు మృతి చెందడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆర్టీసీ కార్మికులు నర్సంపేటలో నిరసనకు దిగారు. నర్సంపేట-మల్లంపల్లి హైవేపై వందలాది మంది బైఠాయించి ఆందోళన చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నర్సంపేటలో ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ సహచరుడికి కడసారి వీడ్కోలు పలికి, నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించాలని కార్మికులు, కుటుంబసభ్యులు వేడుకున్నా వినకపోవడంతో గందరగోళం నెలకొన్నది. కేంద్రమంత్రి మంత్రి బండి సంజయ్ రాకకు ముందే నర్సంపేట పట్టణాన్ని పోలీసుమయం చేశారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శాంక్వర్, డీసీపీ రాజమహేంద్రనాయక్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు చెందిన పలువురు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీస్‌సిబ్బంది ముత్తోజిపేటలో భారీగా మోహరించారు.
ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ బలిదానంపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. శుక్రవారం మధ్యాహ్నం నర్సంపేట ఆర్డీవో ఉమారాణి ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి తక్షణసాయంగా ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు, కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగత సాయంగా మరో రూ.5లక్షలు అందిస్తామని చెప్పినట్టు ఆర్డీవో ప్రకటించారు.
ఆర్టీసీ జాక్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపారులు తమ వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ పాటించి సంఘీభావం ప్రకటించారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. బంద్‌తో ప్రజారవాణా పూర్తిగా స్తంభించింది. బస్సులను బయటకు తీయొద్దని ముందుగానే హైర్ బస్సుల యాజమాన్యాలకు వరంగల్-2 ఎలక్ట్రిక్ బస్సుల డీఎంలకు ఆర్టీసీ ఆర్ఎం ఎస్ భవానీప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు బస్సుల బంద్‌తో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో శుక్ర, శనివారాల్లో జరుగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.