‘తెలంగాణ ఏర్పడ్డాక 1,33,942 పోస్టులను భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, మరో 11,103 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా భర్తీ చేస్తాం’ అని గత ఏడాది మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నట్టుగానే 9 నెలల్లోనే 60,929 ఉద్యోగాలకు అనుమతినిచ్చారు. దేశ చరిత్రలోనే అనతికాలంలో ఇన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. అతి తక్కువ సమయంలో ఉద్యోగ ప్రక్రియ పూర్తిచేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే. సీఎం కేసీఆర్ చెప్పినట్టే.. శుభకృత్ నామ సంవత్సరం తెలంగాణ యువతకు ఉద్యోగ నామ సంవత్సరంగా గుర్తుండిపోయేలా చేశారు.
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర సాగుతున్నది. ఇప్పటికే నీళ్లు, నిధులను సాధించుకోగా, ఇప్పుడు నియామకాల జోరు నడుస్తున్నది. ప్రస్తుతం వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఉద్యోగాల పండుగ జరుగుతున్నది. గత మార్చి 9న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయగా.. 9 నెలల్లోనే 60,929 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మరో నెలలో మిగిలిన 19,110 పోస్టులకు సైతం అనుమతి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సర్కారు చర్యలు చేపట్టింది. దీనితోపాటు ఇటీవలే కొత్తగా మరో 7,029 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో పోలీస్‌శాఖ సైబర్ సేఫ్టీ విభాగంలో 3,966 ఉద్యోగాలు, బీసీ గురుకులాల్లో 2,591 ఉద్యోగాలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వార భర్తీ చేసే అన్ని పోస్టులు కలిపితే మొత్తం కొలువుల సంఖ్య 98,171కి చేరింది. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల్లో ఇప్పటికే 76 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరో 24 శాతం ఉద్యోగాలకు రెండు, మూడు వారాల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది.
టీఎస్పీఎస్సీ నుంచి 18,263 ఉద్యోగాలు
టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చకచకా సాగుతున్నది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయింది. మెయిన్స్‌ను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. 9,168 పోస్టులకు గ్రూప్-4 నోటిఫికేషన్ సైతం విడుదలైంది. ఈ నెల 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అసిస్టెంట్ ఇంజినీర్, లెక్చరర్ తదితర ఉద్యోగాల ప్రక్రియ జరుగుతున్నది. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నుంచి 18,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. టీఎస్పీఎస్సీ గురువారం 783 గ్రూప్ -2 పోస్టులకు, శుక్రవారం 1,373 గ్రూప్-3 పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే 9,50 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలను పూర్తి చేసింది. 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. శుక్రవారమే 5,204 స్టాఫ్‌నర్సుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం మరో 806 ఉద్యోగాలకు నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చింది. గురుకులాల్లో 11,687 ఉద్యోగాలను భర్తీ చేయడానికి గురుకుల విద్యాసంస్థల బోర్డు చర్యలు చేపట్టింది.
పోలీస్ శాఖలో 17,516
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అత్యధిక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు పోలీస్‌శాఖలో 17,516 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది. ఈవెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహించి, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.
95 శాతం.. దేశంలోనే రికార్డు
ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్య, ఉద్యోగాల్లో స్థానికత 85 శాతానికి మించి లేదు. దేశంలోనే తొలిసారిగా 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. వరుసగా 1 నుంచి 7వ తరగతి వరకు అభ్యర్థి చదువుకున్న చోటే 95 శాతం స్థానికత వర్తిస్తుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ యువతకే అత్యధిక ఉద్యోగాలు దక్కుతున్నాయి. 2022 ఉద్యోగ నామ సంవత్సరమని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా.. 2022 తెలంగాణ యువతకు ఉద్యోగనామ సంవత్సరంగా గుర్తుండిపోయేలా చేసింది.