హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో సర్వేకు తెరతీసింది. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చుపెట్టి ఇంటింటి సర్వేను ప్రభుత్వం నిర్వహించింది. ఆ గణాంకాలను పూర్తిగా వెల్లడించలేదు. ఆ గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ జారీచేసిన జీవో-9 ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ప్ర మరో సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. ‘మీ స్వరం-మీ దృష్టి-మన భవిష్యత్తు’ నినాదంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్- 2047’ పేరిట సిటిజన్ సర్వేను శుక్రవారం ప్రారంభించింది. అక్టోబర్ 25వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని వెల్లడించింది.
2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం సాధించి వందేండ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో చేపట్టే ఈ సర్వేలో ప్రజలంతా పాల్గొనాలని, అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఖర్చుతో సిటిజన్ సర్వేను చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.