హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/కోహెడ: బ్రిటన్‌లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. ‘యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్’కు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు నియమితులయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు సభ్యులను ఆ దేశ ప్రధానమంత్రి సలహా మేరకు యూకే రాజు నామినేట్ చేస్తారు. ఉదయ్రాజును బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సూచన మేరకు యూకే రాజు కింగ్ చార్లెస్-2 ఈ పదవిలో నియమించారు. మన దేశంలో రాజ్యసభ (ఎగువ సభ) మాదిరిగానే యూకేలో హౌస్ ఆఫ్ లార్డ్స్ పనిచేస్తుంది. చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను హౌస్ ఆఫ్ లార్డ్స్ నిర్వర్తిస్తుంది. గత సంవత్సరం బ్రిటన్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసిన ఉదయ్ నాగరాజు స్వల్ప తేడాతో ఓడిపోయి, రెండో స్థానంలో నిలిచారు.
పీవీకి సమీప బంధువు
సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. హనుమంతరావు, నిర్మలాదేవి ఆయన తల్లిదండ్రులు. ఆయనకు భార్య గౌరి, కుమార్తె ఉన్నారు. ఆయన సిద్దిపేటలో జన్మించినా.. హైదరాబాద్ ఎస్ఆర్నగర్లో పెరిగారు. నలంద జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తయ్యాక.. మహారాష్ట్రలోని కిట్స్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ విశ్వవిద్యాలయంలో ఐటీ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్)లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే కష్టపడే తత్వం కలిగిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచ రాజకీయాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకున్నారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ‘ఏఐ పాలసీ ల్యాబ్స్’ అనే థింక్-ట్యాంక్‌ను నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్కూల్ గవర్నర్, వాలంటీర్, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా దాదాపు దశాబ్దంపాటు ఇంటింటికీ తిరిగి పనిచేశారు. క్షేత్రస్థాయి సమస్యలపై పట్టు సాధించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు ఈయన సమీప బంధువు.
కేటీఆర్ అభినందనలు
హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేటైన ఉదయ్ నాగరాజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. యూకేలో పబ్లిక్ ఆఫీస్ కోసం పోటీచేయడం మొదలుకొని నేడు ఈ అరుదైన గౌరవం దక్కించుకోవడం వరకు ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్త్తిదాయకమని పేర్కొన్నారు. ఉదయ్ నాగరాజుకు అంతా మంచి జరగాలని, మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు.