హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎరువుల వినియోగం భారీగా తగ్గింది. రైతులు ఒక హెక్టారుకు వినియోగించే ఎరువుల మొత్తాన్ని తగ్గించారు. 2015-16తో పోల్చితే 2020-21 నాటికి సాగు విస్తీర్ణం 50% పెరిగితే ఎరువుల వినియోగం 50% తగ్గింది. ఈ విషయా న్ని కేంద్ర ప్రభుత్వమే లోక్సభలో వెల్లడించింది. 2015-16లో రాష్ట్రంలో హెక్టారుకు 256.13 కేజీల యూరియా వినియోగించగా, 2020-21లో 193.48 కేజీలకు తగ్గించారు. డీఏపీ గతంలో 43.30 కేజీలు వినియోగించగా, 2020-21లో 34.64 కేజీలకు, కాంప్లెక్ ఎరువులు హెక్టారుకు 174.26 కేజీలు వాడగా, 167.51 కేజీలకు తగ్గించారు. 2019-20 సీజన్లో ఎరువుల వినియోగం మరింత తక్కువగా ఉన్నది.
50%పెరిగిన సాగు.. 50% తగ్గిన ఎరువులు
రాష్ట్రంలో గత ఏడేండ్లలో వ్యవసాయం రూపురేఖలే మారిపోయాయి. సాగు విస్తీ ర్ణం గణనీయంగా పెరిగింది. ఎరువులు అత్యధికంగా వినియోగించే వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. 2015-16లో వరి సాగు విస్తీర్ణం 25.85 లక్షల ఎకరాలు కాగా, 2020-21లో ఏకంగా కోటి ఎకరాలకు చేరింది. అంటే ఆరేండ్లలో నా లుగు రెట్లు పెరిగింది. 20 15-16తో పోల్చితే 20 20-21లో సుమారు 50 శాతం పెరగడం గమనా ర్హం. 2015-16లో అగ్రికల్చర్, ఉద్యాన పంట లు కలిపి మొత్తం 1.41 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. 2020-21లో అది ఏకంగా 2.10 కోట్ల ఎకరాలకు పెరిగింది. సాగు విస్తీర్ణం ఇంత భారీగా పెరిగినా ఎరువుల వినియోగం మాత్రం తగ్గింది. రాష్ట్రంలో 2015-16లో 12.53 లక్షల టన్నుల యూరియా వినియోగించగా, 2020-21లో 17.53 లక్షల టన్నులకు పెరిగింది. అయితే సాగు విస్తీర్ణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొంటే ఇది సుమారు 19 లక్షల టన్నులకు పెరగాలి. కానీ 17.53 లక్షల టన్నులకే పరిమితమైంది. అలాగే డీఏపీ 2015-16లో 2.11 లక్షల టన్నులు వినియోగించగా 2020-21లో 3.13 లక్షల టన్నులు వాడారు. సాగు పెరుగుదల ప్రకారం 3.50 లక్షల టన్నులకు చేరాలి. కానీ 3.13లక్షల టన్నులకే పరిమితమైంది.
ఫలితమిచ్చిన ప్రభుత్వ ప్రచారం
రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపట్టిన చర్యలతో ఎరువుల వినియోగం క్రమంగా తగ్గుముఖం పట్టింది. గతంలో రైతులకు ఎరువులు ఏ విధంగా వినియోగించాలో తెలియక అధికంగా చల్లేవారు. దీనిపై వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో ఏఈవోలతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. ఏ పంటకు ఎప్పుడు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో రైతులకు సూచించింది. పొలాల్లో పేరుకుపోయిన భాస్వరం నిల్వలను గుర్తించిన అధికారులు వాటి ఆధారంగా తక్కువ ఎరువులు వినియోగించేలా చర్యలు తీసుకొన్నారు. దీంతోపాటు పంటలకు సహజంగా శక్తినిచ్చే జనుము, జీలుగ, పిల్లి పెసర, మినుము వంటి పచ్చిరొట్ట పైర్ల పెంపుదలను ప్రోత్సహించారు. ఈ విత్తనాలకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ కూడా ఇచ్చింది. ప్రభుత్వ ప్రచారంతో రైతులు క్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. దీంతో ఎరువుల వినియోగం క్రమంగా తగ్గుతున్నది.