హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ అతివేగంగా అడుగులేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్ఠమైన పునాదులను నిర్మించుకొని ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నది. కేంద్రం సహకరించకున్నా సొంతకాళ్లపై నిలబడి స్వయం సమృద్ధి వైపు సాగుతున్నది. కేవలం ఎనిమిదేండ్లలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించి అనూహ్య ఫలితాలు నమోదు చేస్తున్నది. వయసులో చిన్నదైనా పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి ఆర్థిక వృద్ధిలో రికార్డులు సృష్టిస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధిరేటుతో తనకు తిరుగులేదని చాటిప్తున్నది. కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల కంటే తక్కువగా అందుతున్నా ఆర్థిక వృద్ధిలో దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
దేశంలో భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ.. గత ఐదేండ్లలో జీఎస్టీ వసూళ్లలో 49% వృద్ధిరేటును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. 2019 అక్టోబర్ నాటికి రూ.19,775 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లను ఈ ఏడాది అక్టోబర్లో రూ.29,495 కోట్లకు పెంచుకోగలిగింది. కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగానే జరిగడం గమనార్హం. లాక్డౌన్ వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచమంతా స్తంభించిపోయినా తెలంగాణ మాత్రం రూ.15,166 కోట్ల జీఎస్టీ వసూళ్లు సాధించింది.
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 20% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) రూ. 24,575 కోట్లుగా ఉన్నగా ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది అక్టోబర్లో రూ. 29,495 కోట్లకు వృద్ధి చెందాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు మే నెలలో 33 శాతం, జూన్లో 37 శాతం, జూలైలో 26 శాతం పెరిగాయి.