Congress 1000 Days | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగానికే కాదు.. దాని అనుబంధ రంగాలకూ గడ్డుకాలం మొదలైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులపై ఆంక్షలు విధించిందని, కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. పైగా అప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల్లోకి కొనుగోలుదారులు వెళ్లనీయకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను సైతం నిలిపివేసింది. తర్వాత హైడ్రా, మూసీ ప్రాజెక్టు తెరమీదికి రావడంతో రియల్ ఎస్టేట్ రంగానికి గుండెకాయ వంటి జీహెచ్ఎంసీ పరిధిలో అమ్మకాలు, కొనుగోళ్లు కుప్పకూలాయి.
టీజీబీపాస్ అనుమతుల నిలిపివేత, పూర్తయిన ప్రాజెక్టులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల నిలిపివేతతో కొత్త భవనాలు లేక, కట్టిన భవనాలను కొనుగోలుదారులకు అప్పగించలేక రియల్టర్లు, నిర్మాణ సంస్థలవారు లబోదిబోమంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కలిపి నెలకు కనీసం 30 వరకు హైరైజ్డ్ బిల్డింగ్లకు అనుమతులిచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో 10 లోపే హైరైజ్డ్ బిల్డింగ్లకు అనుమతులు ఇచ్చిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీకి గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.300 కోట్ల మేర ఆదాయం పడిపోయింది. 2022-23లో 13,748 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, రూ.1,454 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24 నాటికి 2,456 మాత్రమే అనుమతులు వచ్చాయి. ఫలితంగా ఆదాయం రూ.1,107 కోట్లకు పరిమితమైంది. దాదాపు రూ.300 కోట్లు నష్టపోయినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనుమతులు నిలిపివేయడంతో నష్టం భారీగా ఉన్నదని జీహెచ్ఎంసీ వర్గాలు చెప్తున్నాయి. ఫలితంగా పది నెలల్లో ఒక్క బడా ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా హైడ్రా, మూసీ ప్రాజెక్టులు తమ మీద పడ్డాయని రియల్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హైడ్రా భయంతో చెరువుల చుట్టూ ఉన్న భవనాలు, వెంచర్ల దిక్కు చూసేవారే కరువయ్యారని అంటున్నారు. మూసీ ప్రాజెక్టు మ్యాపులు విడుదల చేసిన తర్వాత ఆ పరిధిలోని నిర్మాణాలన్నీ ఆగిపోయాయని చెప్తున్నారు. అడ్వాన్సులు వెనక్కి ఇవ్వాలని క్యూ కడుతున్నారని వాపోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ బడా ప్రాజెక్టులు అక్రమమని చెప్పడంతో మరో పిడుగు పడ్డట్టయ్యిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నగరంలో రియల్ నిర్మాణ రంగాల వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వకపోగా, ఫోర్త్ సిటీ నామాన్ని జపించింది. ఎంత ప్రచారం చేసినా ఫోర్త్ సిటీవైపు రియల్టర్లు దృష్టిసారించకపోవడంతో హైడ్రా, మూసీని తెరమీదికి తెచ్చారనే ఆరోపణలున్నాయి. బ్రహ్మాండమైన నగరం కడుతామంటూ ప్రచారం చేసి, ఒత్తిడి చేసి ప్రాపర్టీ షోలు పెట్టి మరీ అటువైపు కృత్రిమంగా బూమ్ సృష్టించాలని ప్రయత్నించారని చెప్తున్నారు.