హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడ్డాక జరుగనున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులు. వీరి కోసం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,290 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరుగనున్నది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్‌ను ఏర్పాటు చేశారు. అందులో తన ఓటును చూసుకోవచ్చు. ఏడు సెకండ్ల పాటు ప్రింట్ కనిపిస్తుంది. ఎన్నికల కోసం 2.50 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. లక్ష మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. బుధవారం సాయంత్రానికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయాన్నే మాక్ పోలింగ్ అనంతరం ఓటింగ్ ప్రారంభిస్తారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచారం, కార్యకర్తలు, నాయకులు ఉండటానికి వీల్లేదు. పోలింగ్ కేంద్రంలోకి పార్టీ గుర్తులు, పేర్లు, జెండాలతో లోపలికి అనుమతించరు.
క్యూలో ఎంత మంది ఉన్నారు?
హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 నియోజకవర్గ ఓటర్ల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రం ఎక్కడి ఉన్నదో తెలుసుకోవడానికి మ్యాప్ సౌకర్యం, పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల క్యూ ఏవిధంగా ఉన్నదో తెలుసుకోవడానికి https:// ghmcbls.in/poll-queue-status వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇందులో పోలింగ్ కేంద్రాల్లో ఎంత మంది లైన్లో ఉన్నారన్నదీ తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రం లోకేషన్ తెలుసుకోవచ్చు. జిల్లా పరిధిలోని ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. పట్టణాల్లో తక్కువ ఓటింగ్ శాతం జరుగుతున్న నేపథ్యంలో వారి వెసులుబాటు కోసం ఏర్పాటు చేశారు. పట్టణాల్లో ధనవంతులు, విద్యావంతులు, ప్రైవేటు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఓటింగ్‌కు రావటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి సౌకర్యం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో తక్కువ ఓటర్లు ఉన్నప్పుడు ఓటింగ్‌కు వెళ్లే అవకాశం కలగనున్నది.
ఓటర్ కార్డు లేకుంటే వీటిలో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాలి
ఆధార్ కార్డు
పాన్ కార్డు
బ్యాంకు పాస్ బుక్
ఉపాధిహామీ జాబ్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్ , పాస్‌పోర్టు
ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు
హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
యూనిక్ డిసెబిలిటీ కార్డు
ఫొటో పెన్షన్ డాక్యుమెంట్
నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్ జారీ చేసిన కార్డు
రాష్ట్రంలో ఓటర్లు : 3,26,18,205
పురుషులు : 1,63,13,268
మహిళలు : 1,63,02,261
ట్రాన్స్జెండర్లు : 2,676
సర్వీస్ ఓటర్లు : 15,406
రాష్ట్రంలో నియోజకవర్గాలు : 119
ఎస్సీ నియోజకవర్గాలు : 19
ఎస్టీ నియోజకవర్గాలు : 12
బరిలో ఉన్న అభ్యర్థులు : 2290
బరిలో ఉన్న పురుషులు : 2068
బరిలో ఉన్న మహిళలు : 221
బరిలో ఉన్న ట్రాన్స్జెండర్లు : 01
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు : 35,655
సమస్యాత్మక కేంద్రాలు : 12,000
వెబ్‌క్యాస్టింగ్ కేంద్రాలు : 27,094
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
దివ్యాంగులు నిర్వహించేవి : 120
మహిళలు నిర్వహించేవి : 597
యువత నిర్వహించేవి : 119
మోడల్ పోలింగ్ కేంద్రాలు : 644