జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వాల పాలనతీరుకు ఒక గీటురాయి. ఒక రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక కొలమానం. ప్రజల కొనుగోలు సామర్థ్యానికి సూచిక. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పే ప్రమాణం. జీఎస్టీ వసూళ్లు పెరిగితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. కానీ.. రాష్ట్రంలో మాత్రం పూర్తిగా రివర్స్ అయింది. కాంగ్రెస్ పాలనలో ఆర్థికవృద్ధి అట్టర్ ప్లాప్‌గా నమోదైంది. కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూళ్లు రెండంకెల వృద్ధిరేటుతో రంకెలు వేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పురోగతి మాట దేవుడెరుగు.. మైనస్ వృద్ధిరేటుతో దేశంలోనే అట్టడుగు స్థాయికి తెలంగాణ పడిపోయింది.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆర్థికరంగ అభివృద్ధిలో కాంగ్రెస్ ‘అట్టర్ ప్లాప్’ అని మరోసారి నిరూపితమైంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. కరోనాతో పోటీపడుతూ ఆర్థిక రంగాన్ని విధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ఏకంగా దేశంలోనే అట్టడుగున నిలిచింది. తెలంగాణ చరిత్రలోనే చెత్త రికార్డును సొంతం చేసుకున్నది. ఇందుకు సెప్టెంబర్‌లో నమోదైన జీఎస్టీ వసూళ్లే నిదర్శనం. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో రాష్ర్టాలు జీఎస్టీ వసూళ్లలో సగటున 7% వృద్ధిరేటును నమోదు చేశాయి. తెలంగాణ మైనస్ 5% వృద్ధిరేటును సాధించింది. అంటే నిరుడి కన్నా జీఎస్టీ ఆదాయం 5% తగ్గిపోయింది. నిరుడు రూ.5,267 కోట్లు వసూలుకాగా, ఈ ఏడాది రూ.4,998 కోట్లు వచ్చా యి. రూ.267 కోట్లు తగ్గాయి. తద్వారా జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో దేశంలోనే తెలంగాణ చివరిస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్ మైనస్ 4% వృద్ధిరేటుతో తెలంగాణ తర్వాతి స్థానంలో నిలిచింది. దీనినిబట్టే కాంగ్రెస్ పాలన అట్టర్‌ప్లాప్ అని స్పష్టమవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
కేంద్రం 2020 జనవరి నుంచి రాష్ర్టాల వారీగా జీఎస్టీ వసూళ్ల లెక్కలను విడుదల చేస్తున్నది. కేసీఆర్ హయాంలో 2021 నుంచి తెలంగాణలో ప్రతి ఏటా సెప్టెంబర్‌లో రెండంకెల వృద్ధిరేటు నమోదైంది. 2020లో కరోనా కారణంగా వసూళ్లు పడిపోగా.. ఆ తర్వాతి నుంచి పుంజుకున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020తో పోల్చితే 2021 సెప్టెంబర్‌లో 25% వృద్ధిరేటు నమోదుకాగా, 2022లో 12% పెరిగింది. 2023లో 33% వృద్ధిరేటు సాధించింది. పెద్ద రాష్ర్టాల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఇది కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతకు, పాలనాతీరుకు గీటురాయి అని నిపుణులు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి మందగించింది. 2024 జనవరి మొదలు ప్రతినెలా ఆర్థిక రంగం క్రమంగా క్షీణిస్తూ వస్తున్నదని గణాంకాలే చెప్తున్నాయి. 2023తో పోల్చితే 2024 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్ల వృద్ధి ఒక్కశాతమే నమోదైంది. ఈ ఏడాది ఏకంగా -5 శాతానికి పడిపోయింది. వాస్తవానికి బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సెప్టెంబర్‌లో వసూళ్లు పెరుగాల్సిందిపోయి, తగ్గిపోవడంపై నిపుణు లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వస్త్ర, వస్తు, వాహన కొనుగోళ్లు జోరుగా జరగాల్సిన పండు గ సీజన్ వెలవెలబోయిందని గణాంకాల ద్వారా తెలుస్తున్నది. దీనిని బట్టి కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని, వ్యాపార, వాణిజ్య రంగాలు తిరోగమనంలో సాగుతున్నాయని స్పష్టమవుతున్నది.
‘కాంగ్రెస్ 22 నెలల పాలనలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగింది. జీఎస్టీ వసూళ్ల వృద్ధిరేటులో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలువడమే ఇందుకు నిదర్శనం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూళ్లలో ప్రథమ స్థానం లో నిలిచిన రాష్ట్రం.. ఇప్పుడు అట్టడుగుకు స్థాయికి పతనం కావడంపై శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అనుభవలేమి, అవినీతి, అరాచక విధానాలే ఈ దుస్థితికి కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయం మొదలు రియల్ ఎస్టేట్ వరకు అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. దీంతో 2025 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్ల వృద్ధిరేటు అధఃపాతాళానికి పడిపోయిందని విమర్శించారు. సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఈ సూచికలే అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అరాచక విధానాలను నిలిపివేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.