హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): దేశంలో పీజీ మెడికల్ సీట్లు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 5,248 పీజీ సీట్లు ఉన్నాయని, వాటిలో 1,790 ప్రభుత్వ సీట్లు, 3,458 ప్రైవేట్ సీట్లు ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్లో వెల్లడించారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ), నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎమ్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 86,360 మెడికల్ పీజీ సీట్లు ఉన్నాయని చెప్పారు. 10,092 మెడికల్ పీజీ సీట్లతో కర్ణాటక దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
ఆ రాష్ట్రంలో 2,805 ప్రభుత్వ సీట్లు, 7,287 ప్రైవేట్ సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (4,277 ప్రభుత్వ సీట్లు, 4,939 ప్రైవేట్ సీట్లు), తమిళనాడు (3,030 ప్రభుత్వ సీట్లు, 4,993 ప్రైవేట్ సీట్లు), ఉత్తరప్రదేశ్ (3,568 ప్రభుత్వ సీట్లు, 3,869 ప్రైవేట్ సీట్లు) ఉన్నాయి. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మొత్తం 4,782 పీజీ మెడికల్ సీట్లతో ఆరో స్థానంలో నిలిచింది. స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. దీంతో 2023 నాటికి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 34కు చేరింది. ఇదే సమయంలో ప్రభు త్వ పీజీ సీట్లు 515 నుంచి 1,320కి, మొత్తం పీజీ సీట్లు 1,183 నుంచి 2,869కి పెరిగాయి. వీటిలో 1,686 సీ ట్లు బీఆర్ఎస్ హయాంలోనే పెరిగాయి.
