హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో తెలంగాణ ‘బెస్ట్ పెర్ఫార్మర్’గా నిలువడంపై వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ప్రణాళికాసంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం దిశగా పయనిస్తున్నది. పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల బలోపేతం నుండి పట్టణాల్లో బస్తీ దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు ఎన్నడూ లేనంత సౌకర్యాలు మెరుగుపడ్డాయి. మన రాష్ట్రంలో సామాన్యుడికి ఉచితంగా ప్రపంచ స్థాయి వైద్యం అందుతున్నది. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ మరోసారి స్పష్టం చేసింది’ అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఇది డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది, రాష్ట్ర పాలనా యంత్రాంగం సాధించిన విజయంగా అభివర్ణించారు. తెలంగాణను ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో కూడిన గ్లోబల్ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామన్నారు.
ప్రాంతీయ పార్టీల నిబద్ధతకు నిదర్శనం: వినోద్
సీఎం కేసీఆర్ పకా ప్రణాళికతో చేసిన పనితీరు వల్లే ఇది సాధ్యమైందని, రానున్న రోజుల్లో అగ్ర స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు పెద్ద రాష్ర్టాలైన కేరళ, తమిళనాడు, తెలంగాణలో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని గుర్తుచేశారు. ప్రాంతీయపార్టీల నిబద్ధత, పనితీరుకు ఇది నిదర్శనమని చెప్పారు. మరోవైపు.. దవాఖాన ప్రసవాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో బెస్ట్ పెర్ఫార్మర్గా నిలిస్తే, గుజరాత్ వరస్ట్ పెర్ఫార్మర్గా నిలిచిందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. పురపాలకశాఖమంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
బెస్ట్ తెలంగాణ.. వరస్ట్ రాజస్థాన్
నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో తెలంగాణ బెస్ట్ పెర్ఫార్మర్గా నిలిస్తే.. రాజస్థాన్ వరస్ట్ పెర్ఫార్మర్గా నిలిచింది. 2019-20లో పనితీరులోనూ, 2018-19, 2019-20 మధ్య పోల్చినప్పుడు పురోగతిలోనూ స్థిరమైన వృద్ధి సాధించిన తెలంగాణకు బెస్ట్ పెర్ఫార్మర్ స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఈ రెండు రాష్ర్టాల మధ్య తేడాను వివరించింది.