నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 23 : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో పల్లెలు, పట్టణాల్లోని లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు అలుగుపోస్తున్నాయి.
వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని ములుగు జి ల్లా వెంకటాపురంలో అత్యధికంగా 25.5 సెం. మీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 33 జిల్లాల్లోని మొత్తం 621 మండలాలకుగాను 586 మండలాల్లో వర్షాలు కురిసినట్టు వెల్లడించింది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ గ్రామంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. వాల్గొండ సబ్ సెంటర్ పరిధిలోని వైద్య సిబ్బంది, ఏఎన్ఎం విజయసుందరి మామిడిగూడ వాగును దాటి ఆదివాసీ గిరిజనులకు వైద్యం అందించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ ఆత్రం అనుసూయ పాల్గొన్నారు.
తిమ్మాపూర్, జూలై 23: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలో చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నగరానికి చెందిన సర్వర్(52), అతని తమ్ముడి కుమారుడు రిజ్వాన్(20), మరో వ్యక్తి ఇసాక్ బుధవారం ఉదయం ఎల్ఎండీలో చేపలు పట్టేందుకు వెళ్లారు. రిజ్వాన్ ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. రిజ్వాన్‌ను కాపాడేందుకు సర్వర్ ప్రయత్నించి, అతడు కూడా నీటిలో మునిగిపోయాడు. ఇరువురి మృతదేహా లను పోలీసులు వెలికితీశారు.
హైదరాబాద్, జూలై 23 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో తూర్పు, పశ్చిమద్రోణి ప్రభావంతో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష హెచ్చరిక జారీచేసింది.
నిర్మల్, నిజామాబాద్, జిగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. గురువారం జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.