హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వారంరోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు మండిపోతుంటే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే 48గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు వెల్లడించింది. ఈనెల 18 నుంచి 22 వరకు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరుకోవచ్చని హెచ్చరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈనెల 15నాటికి అండమాన్ దీవులను తాకే అవకాశం ఉన్నా, అవి తెలుగు రాష్ట్రాలకు చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని అంచనా వేసినట్టు తెలిపింది.