హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): సైనిక్ స్కూళ్ల ఏర్పాటులో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, ఈ విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోలేదని విమర్శించారు. సైనిక్ స్కూళ్లు ఏపీకి తరలిపోతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి చొద్యం చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీలోని కోరుకొండ, కలికిరి వంటి సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు కూడా లోకల్ కోటా వర్తింపచేసి, ఆ ప్రకారం అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు ఏపి సైనిక్ స్కూళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు 67 శాతం లోకల్ కోటా అమలు చేసేవారని, కానీ ఈ లోకల్ కోటా నుంచి తెలంగాణ విద్యార్థులను తొలగిస్తూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్లు పొందాలంటే 33 శాతం ఓపెన్ కోటాలోనే జాతీయ స్థాయిలో పోటీపడాల్సి ఉంటుందని తెలిపారు. సైన్యంలో చేరాలన్న లక్ష్యం తెలంగాణ విద్యార్థులకు అందని ద్రాక్షలాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక్ స్కూళ్లలో లోకల్ కోటాను పునరుద్ధరించేంత వరకు తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.
ఏపీ విభజన చట్టం ప్రకారం వరంగల్ జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం సానుకూలం వ్యక్తం చేసిందని, కానీ అందుకోసం భూమి, భవనాలతోపాటు జీతభత్యాల ఖర్చలన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరించాలని కేంద్ర మెలిక పెట్టిందని తెలిపారు. దీనిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కేంద్రానికి సుధీర్ఘ లేఖ రాసి, మిగితా సైనిక్ స్కూళ్ల మాదిరిగానే దీనిని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు.
కేసీఆర్ డిమాండ్‌కు కేంద్రం ససేమిరా అనడంతో అది పెండింగ్‌లో ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని వారు ఏ మాతం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపి, తెలంగాణలో ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటయ్యేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.