Sainik School | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : కోరుకొండ సైనిక్ స్కూల్లో తెలంగాణ కోటా సీట్ల రద్దు రగడ కొనసాగుతుండగా, తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధప్రదేశ్‌లోని కలికిరి సైనిక్ స్కూల్లోనూ తెలంగాణ కోటా రద్దు చేశారు. 2025-26 విద్యాసంవత్సరానికి కలికిరి సైనిక్ స్కూల్లోనూ తెలంగాణకు గల హోం స్టేట్ హోదాను ఉపసంహరించారు. ఇటీవలే కేంద్ర రక్షణశాఖ సైనిక్ స్కూల్స్ విభాగం కలికిరి సైనిక్ స్కూల్లో తెలంగాణకు గల హోం స్టేట్ హోదాను ఉపసంహరిస్తున్నట్టు స్పష్టంచేసింది. కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లల్లో హోం స్టేట్ హోదాలో తెలంగాణ విద్యార్థులు 67% సీట్లకు పోటీపడేవారు.
కానిప్పుడు కోరుకోండతోపాటు, కలికిరి సైనిక్ స్కూళ్లల్లో తెలంగాణ విద్యార్థులు 33% సీట్లను, అది కూడా ఆలిండియా కోటాలో పోటీపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ హోం స్టేట్ హోదాను ఉపసంహరించడం, తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉన్న ఫలంగా అడ్మిషన్లను రద్దుచేయడాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్సేథ్ను కలిసి న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం సైనిక్ స్కూళ్లల్లో తెలంగాణకు గల న్యాయమైన కోటాను పునరుద్ధరించాలని, తెలంగాణలో రెండు సైనిక్ స్కూళ్లను స్థాపించాలని, భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లలో రాష్ర్టాలవారీగా రిజర్వేషన్ మార్గదర్శకాలను స్పష్టంచేయాలని కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
మనకే సైనిక్ స్కూల్ ఉంటే 67% దక్కేవి
మా బాబు లక్షణ్సాయి సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్టు రాశారు. రెండేండ్లుగా పరీక్షకు ప్రిపేరవుతున్నాడు. ఈ సారి ఓబీసీ కోటాలో సీటు వస్తుందని ఆశపడ్డాం. కానిప్పుడు హోం స్టేట్ హోదాను రద్దుచేశారు. దీంతో మా ప్రయత్నమంతా వృధా అయ్యింది. ఇప్పుడు సీటు రావాలంటే 33% సీట్లకు పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ లేదు. మనకే సైనిక్ స్కూల్ ఉంటే 67% సీట్లు దక్కేవి.
– శ్రీరాములు, విద్యార్థి తండ్రి