హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ – అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ – యూజీ) ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఫలితాలను ప్రకటించింది. తెలంగాణకు చెందిన కాంచని గేయంత్ రఘురామ్‌రెడ్డి 715 మార్కులతో ఆల్ ఇండియా 15వ ర్యాంక్‌ను సాధించాడు. జాగృతి బొడెద్దులు 710 మార్కులతో ఆలిండియా 49వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నది. తమిళనాడుకు చెందిన ప్రభంజన్, ఏపీకి చెందిన బోర వరుణ్ చక్రవర్తి 720కి 720 మార్కులు సాధించి ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించారు. తెలంగాణ విద్యార్థులు లక్ష్మీ రష్మిత గండికోట 52వ ర్యాంక్, గిలాడ ప్రాచీ 65వ ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. తేల్ల వరుణ్‌రెడ్డి 105వ ర్యాంక్‌ను, కొల్లాబత్తుల ప్రీతమ్ సిద్ధార్థ్ 299 ర్యాంక్, లావుడి మధు బాలాజీ 445 ర్యాంక్‌లు సాధించారు.
భారీగా పెరిగిన తెలంగాణ విద్యార్థుల సంఖ్య
నీట్లో ఈ ఏడాది ఏకంగా 42,654 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే దాదాపు 14 వేల మంది ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. ఏపీకి చెందిన వారు ఈసారి 42,836 మంది క్వాలిఫై అయ్యారు.
56.21 శాతం ఉత్తీర్ణత
ఈ ఏడాది నీట్-యూజీ పరీక్షలో 56.21 ఉత్తీర్ణత శాతం నమోదైంది. పరీక్ష రాసిన 20,38,596 మంది విద్యార్థుల్లో 11,45,976 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా యూపీ నుంచి 1,39,961 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11,56,618 మంది అమ్మాయిలు పరీక్ష రాయగా 6,55,599 మంది ఉత్తీర్ణత సాధించారు. 8,81,967 మంది అబ్బాయిలు పరీక్షకు హాజరుకాగా 4,90,374 మంది ఉత్తీర్ణులయ్యారు. క్యాటగిరీ వారీగా ఓబీసీలు 5,25,194 మంది, ఎస్సీలు 1,53,674 మంది, ఎస్టీలు 56,381 మంది, జనరల్ క్యాటగిరీలో 3,12,405 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 98,322 మంది ఉత్తీర్ణత సాధించారు. మే 7న 14 నగరాల్లో మొత్తం 4,097 సెంటర్లలో నీట్-యూజీ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.
కార్డియాలజిస్ట్ లేదా న్యూరో సర్జన్‌ను అవుతా
డాక్టైర్లెన అమ్మానాన్నలను చూసే నేను డాక్టర్ కావాలనుకున్నా. ఎయిమ్స్ ఢిల్లీలో చదువుతా. కార్డియాలజిస్ట్ లేదా న్యూరో సర్జన్ కావాలన్నది నా లక్ష్యం.
– రఘురామ్ రెడ్డి
రోగులకు సేవలందిస్తా
ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా సన్నద్ధమయ్యాను. ఏయిమ్స్ ఢిల్లీ లేదా జిప్మర్లో చేరుతా. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి రోగులకు సేవలందిస్తా.
– జాగృతి బొడెద్దుల