హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్టు, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేయలేదని వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వనిపక్షంలో పాత విధానంలో ఎన్నికలు నిర్వహించవచ్చునని పేర్కొన్నది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం పాత విధానంలో అంటే బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 శాతం చొప్పున కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహించవచ్చునని స్పష్టంచేసింది. పాత పద్ధతిలో సీట్ల రిజర్వేషన్ల ప్రక్రియను సవరించి ఆమేరకు సీట్లు, రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చని చెప్పింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అడ్డుకుంటూ జారీ చేసిన మధ్యంతర స్టే ఆదేశాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయడం లేదని తేల్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మోహియొద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం జారీ చేసిన స్టే ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాల ప్రతి శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత దశలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేస్తే తిరిగి సరిదిద్దలేని పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నదని హైకోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గత నెల 26న ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన జీవో 9, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42 అమలును నిలిపివేస్తూ స్టే జారీ చేసింది.
కేశవ్ కిషన్‌రావు గవాలి కేసును పరిగణనలోకి తీసుకుని జీవో 9, 41, 42ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని తెలిపింది. రాహుల్ రమేశ్ వాగ్మహారాష్ట్ర మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు ట్రిపుల్ టెస్ట్ చేయాలని 2022లో తీర్పు వెలువరించిందని చెప్పింది. ఈ తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో ఓబీసీల రిజర్వేషన్ల పరిమితిని పెంచాలంటే ముందుగా ట్రిపుల్ టెస్ట్ చేయాలని గుర్తుచేసింది. ‘స్థానిక స్థాయిలో ఓబీసీలపై సమగ్ర డాటా సేకరించేందుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్ అధ్యయనం చేసిన డాటా ఆధారంగా రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించాలి. మొత్తం రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) 50 శాతానికి మించకూడదు’ అని ట్రిపుల్ టెస్ట్ గురించి సుప్రీంకోర్టు వివరించింది.
ఈ విధంగా చేయకపోవడంతో మహారాష్ట్రలో రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించడంతో సుప్రీంకోర్టు నిలుపుదల చేసిందని గుర్తుచేసింది. రాష్ట్రంలో బీసీలకు ఉన్న 25 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతున్నాయని, ఇది సుప్రీంకోర్టుకు తీర్పునకు వ్యతిరేకమని స్టే ఆదేశాల్లో పేర్కొన్నది. మరో కేసులో సుప్రీంకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక కోర్టుల జోక్యానికి వీలు లేదన్న తీర్పు నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడం లేదని స్పష్టంచేసింది. రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు ట్రిపుల్ టెస్ట్ పాటించకపోతే, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితులు లేకపోతే పెం చిన 17 శాతం రిజర్వేషన్లను జనరల్ క్యాటగిరీగా పరిగణించాలని, ఆ మేరకు నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదన్నది. విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.