హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యనేత, అందుకు సంబంధించిన ఆపరేషన్ బాధ్యతలను ‘డిప్యూటీ’కి అప్పగించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ రచ్చ లేకుండా సైలెంట్‌గా రాజీనామా చేయించే టాస్‌ను డిప్యూటీకి అప్పగించినట్టు సమాచారం. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వివాదాస్పద ఆరోపణలు ఇరుకున పెడుతున్న నేపథ్యంలో కొండాను మంత్రి పదవి నుంచి తప్పించాల్సిందేనని ముఖ్యనేత పట్టుతో ఉన్నట్టు తెలిసింది. బీసీ, మహిళా తదితర రాజకీయ లెక్కలతో ఢిల్లీ అధిష్ఠానం ఆమెపై కొంత సానుకూల ధోరణితో ఉన్న నేపథ్యంలో హైకమాండ్‌ను ఒప్పించి, కొండా సురేఖను తప్పించే బాధ్యతను డిప్యూటీకి అప్పగించినట్టు సమాచారం. కొండా సురేఖను స్వయంగా కలిసి, ఆమెను అవమానించిన భావన కలుగకుండా, బహిరంగ ఘర్షణకు తావులేకుండా పదవికి రాజీనామా చేసేలా ఒప్పించాలని ముఖ్యనేత సూచించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదంపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా వ్యవస్థ ముందుకువెళ్లింది. ఆగస్టు 19న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీసు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. తన కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సురేఖ స్పష్టంచేశారు.
నోటీసును ఉపసంహరించుకోవాలని కూడా కోరారు. అయితే ఈ విషయం అకడితో ఆగలేదు. సురేఖపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఓవైపు సురేఖ తనపై వస్తున్న విమర్శలను ‘సీనియర్ బీసీ మహిళా నేతపై దాడి’గా అభివర్ణిస్తుండగా, మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే వివాదం ఇక తల్లీకూతురు వ్యాఖ్యలకే పరిమితం కాకుండా జాతీయ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి చుట్టుకున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
ఇదే సమయంలో సీఎం శిబిరం నుంచి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే దిశగా కసరత్తు జరిగిందన్న ప్రచారం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సురేఖకు వ్యతిరేకంగా బలప్రదర్శన చేయాలన్న ఆలోచన జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు సమీకృతం కాకపోవడం ముఖ్యనేత శిబిరానికి రాజకీయ హెచ్చరికగా మారింది. తాజాగా 17 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా సురేఖపై చర్యలు కోరగా, ఆ తర్వాత మరో పది మందికిపైగా అదే డిమాండ్ చేసినట్టు తాజా కథనాలు వెల్లడించాయి.
ఇకడే ముఖ్యనేత వ్యూహంలో మార్పు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తనంతట తానుగా బర్తరఫ్ ప్రతిపాదన తెచ్చినా.. తన సీటుకే ప్రమాదమని గ్రహించిన ముఖ్యనేత, పార్టీ క్రమశిక్షణా కమిటీని ముందుపెట్టి, ఆ తర్వాత రాజకీయ పరిషారం కనుకోవడం సురక్షితమైన మార్గంగా భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అందుకే బహిరంగంగా ఘర్షణకు దిగకుండా ‘ఇది క్రమశిక్షణా కమిటీ పరిధిలోని అంశం’ అనే పరిమిత వ్యాఖ్యలకే వ్యవహారాన్ని కట్టిపడేయడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డిప్యూటీ ద్వారా కొండా సురేఖను ఒప్పించి సైలెంట్‌గా రాజీనామా చేయించాలని, ఈ లోగా ఆమెపై ముప్పేట ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆమెకు చేదోడువాదోడుగా ఉన్నవారి వివరాలు సేకరించి వారిపైనా కేసులు నమోదు చేయడం, శాఖాపరంగా తాను తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడం, అటవీ శాఖ, దేవాదాయ శాఖలో ఉద్యోగుల డిప్యుటేషన్ల రద్దు తదితర నిర్ణయాలతో ఆమెపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు సమాచారం.