Telangana Budget | తెలంగాణ పోలీసింగ్ ఇతర రాష్ట్రాల పోలీసులకు రోల్ మోడల్‌గా మారిదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో హోంశాఖకు రూ. 9,599 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
రాష్ట్ర పోలీసులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని గతేడాది ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు నిఘాతో పాటు, అత్యవసర పరిస్థితులు, ఇతర విపత్కర సందర్భాల్లో వివిధ శాఖలను అనుసంధానం చేశామన్నారు.
రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతల నిర్వహణ ఒక కారణమని హరీశ్‌రావు పేర్కొన్నారు.