దూరదృష్టితో రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ వింగ్
హైదరాబాద్‌ను డ్రగ్ రహిత నగరంగా తీర్చిదిద్దుదాం: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14: మాదకద్రవ్యాలను వ్యసనంగా మార్చుకొని విద్యార్థులు, యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ‘డ్రగ్స్ రహిత’ నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా సోమవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సెంట్రల్ జోన్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. నేడు సమాజంలో రెండు ప్రధాన సమస్యలున్నాయని.. మొదటిది నిరుద్యోగం కాగా రెండోది మాదకద్రవ్యాల వినియోగమని చెప్పారు. పంజాబ్ వంటి రాష్ర్టాల్లో ప్రభుత్వాలు మేల్కొనకపోవడంతో డ్రగ్స్ భూతం చిన్న పట్టణాలకూ పాకిందని తెలిపారు. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్ వెయ్యిమందితో ప్రత్యేక నార్కొటిక్స్ విభాగాన్ని ఏర్పాటుచేస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థ్ధాలను వివరించే పోస్టర్లు, కరపత్రాలను పంపిణీ చేసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అరోరా, అంబేద్కర్ కాలేజీల విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీలో సీపీ ఆనంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్చంద్ర, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర, అరోరా కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.